మాజీ మంత్రి కొడాలి నాని వారం రోజుల కిందట ఆస్పత్రిలో చేరినప్పుడు ఆయన కేవలం గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరారని బయట జరుగుతుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీం కొడాలి పేరుతో మీడియాకు సమాచారం ఇచ్చారు. అంతా అది నిజం అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు అనారోగ్యం ఉంటే దాచి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలియచేస్తే పోయేదేం ఉండదు. నేతలకు అనారోగ్యం విషయంలో ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వడం సహజంగా జరిగేదే. ముఖ్యంగా ఆస్పత్రిలో చేరితే .. హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేస్తారు. లేకపోతే తప్పుడు ప్రచారాలు జరుగుతాయి.
అయితే కొడాలి నాని ఆరోగ్యంపై ఇప్పటి వరకూ ఏఐజీ ఆస్పత్రి వర్గాలు ఎలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. ఆయన కుటుబంసభ్యులు కూడా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఓ దశలో ఆయన డిశ్చార్జ్ అయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ హఠాత్తుగా ఆయనను ప్రత్యేక విమానంలో ముంబై ఆస్పత్రికి తరలించిన తర్వాత అసలు విషయం వెలుగు చూసింది. సాయి కన్స్ట్రక్షన్స్ కంపెనీ కి చెందిన విమానంలో తరలించారు. ఆయన వెంట కుటుంబసభ్యులు ఓ డాక్టర్, నర్సు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం కూడా అనధికారికంగానే తెలిసింది కానీ.. అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు.
ఆయనను ముంబై తరలించిన తర్వాత మూడు గుండె వాల్వ్ లు మూసుకుపోయాయనని.. టెస్టుల్లో కిడ్నీ సమస్యలు కూడా బయట పడ్డాయని కొడాలి వర్గీయుల నుంచి మీడియాకు సమాచారం లీక్ చేశారు. గుండెలో ఉండే నాలుగు వాల్వుల్లో మూడు మూసుకుపోతే ఏ క్షణమైనా తీవ్రమైన గుండెపోటు వస్తుందని చెబుతారు. కిడ్నీ సమస్యలు కూడా ఉంటే.. సర్జరీ చేయడం క్లిష్టం అవుతుంది. అందుకే ఆయనను ముంబై తరలించినట్లుగా తెలుస్తోంది. ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా కొడాలిని కాపాడుకునే ప్రయత్నాన్ని కుటుంబసభ్యులు చేస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల్ని రహస్యంగా ఉంచడం వల్ల అనేక ప్రచారాలు జరగడానికి కారణం అవుతోంది.