తొలి దశ డ్రగ్స్ విచారణని సిట్ విజవంతంగా ముగించేసింది. అయితే… ఎన్నో విమర్శల్ని ఎదుర్కోవాల్సివచ్చింది. సినిమావాళ్లని మాత్రమే సిట్ టార్గెట్ చేసిందని, డ్రగ్స్ బాధితుల్ని – డ్రగ్స్ నేరస్థుల రేంజులో ప్రశ్నిస్తోందన్న విమర్శలు వినిపించాయి. అందుకే ఇక మీదట కాస్త ఆచి తూచి స్పందించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం అందుతోంది. రెండో విడత జాబితా సిద్ధం చేసినప్పటికీ, దాన్ని బయటకు వదలకపోవడానికి ప్రధాన కారణం ఇదే. ఇక మీదట విచారణ అంతా గోప్యంగా జరపాలని సిట్ నిర్ణయించుకొంది. ఎవరికి నోటీసులు అందాయో ఇక మీదట ఎవ్వరికీ చెప్పదట. తొలిసారి 12 మంది పేర్లు.. మీడియాకు ముందే లీక్ అయిపోయాయి. వాళ్లను అడగబోయే ప్రశ్నలేంటన్న విషయంలోనూ మీడియాకు ముందే ఉప్పందేసింది. అంతేకాదు… సిట్విచారణ సందర్భంగా ఎవరెవరు ఎలా స్పందించారు, ఎలాంటి జవాబులు ఇచ్చారు, అక్కడ వారి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అనే విషయంలోనూ మీడియాకు లీకేజీలు అందేశాయి. దాంతో… ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి.
ఇక మీదట ఇలాంటి లీకేజీలకు అవకాశం ఇవ్వకూడదని సిట్ భావిస్తోందట. విచారణ కూడా.. చాలా రహస్యంగా, వేర్వేరు ప్రదేశాల్లో జరపాలని సిట్ భావించిందని తెలుస్తోంది. సో.. రెండో జాబితా ఎప్పుడొస్తుందో ఇక మీడియాకు తెలిసే అవకాశం లేదు. బహుశా…ఇప్పటికే కొంతమందికి నోటీసులు అందినా.. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రెండో జాబితాలో పెద్ద చేపల పేర్లు ఉండడంతోనే ఈ జాగ్రత్తలు తీసుకొన్నారేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో నిజా నిజాలెంతో సిట్కే తెలియాలి.