ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టెస్టులు చేస్తోంది. ప్రతీ రోజూ.. ఏ ఏ జిల్లాల్లో ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయో.. వివరంగా ప్రకటిస్తూ ఉండేది. కానీ రెండు రోజుల నుంచి జిల్లాల వారీగా వివరాలు ఇవ్వడం లేదు. రోజు మొత్తం మీద ఇన్ని కేసులు మాత్రమే నమోదయ్యాయని ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తున్నారు. ఏ జిల్లాల్లో నమోదయ్యాయి.. కొత్తగా కంటెయిన్మెంట్ జోన్లు ఎక్కడైనా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి వచ్చిందా అన్న విషయాలపై మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ.. జిల్లాల వారీగా కేసుల గురించి మీడియాకు ప్రకటన చేయవద్దని కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు పంపించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆంక్షలు ఎత్తివేస్తున్నారు. ఆర్టీసీ బస్సులను కూడా నడపడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం కావాలనే జిల్లాల వారీగా కేసుల నమోదును నిలిపివేసిందని భావిస్తున్నారు. రోజుకు అరవై చొప్పున కేసులు నమోదవుతున్నాయి. ఆ కేసులు ఎలా నమోదవుతున్నాయన్నదానిపైనా.. ప్రజలకు అవగాహన కలగాల్సి ఉంది. కోయంబేడు మార్కెట్ ద్వారా.. వలస కూలీల ద్వారా కేసులు పెరుగుతున్నాయని నిన్నటిదాకా చెప్పారు కానీ.. ఇప్పుడు… వాటి ద్వారా వచ్చిన కేసులే కాకుండా.. ప్రైమరీ, సెకండరీ కేసులు కూడా తగ్గిపోయాయని అంటున్నారు. అయినప్పటికీ.. పాజిటివ్ కేసులు అరవైకి తక్కువ కాకుండా నమోదవుతున్నాయి.
వైరస్ విషయంలో వీలైనంత గోప్యత పాటించాలన్న పద్దతిని ఫాలో అవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. భవిష్యత్‌లో కరోనా రాని వారెవరూ ఉండరంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడంతో… ఓ రకంగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని.. దాని గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నట్లుగా…ప్రభుత్వపెద్దలు అంచనాలకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.