జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఉరుములేని పిడుగులా.. నిన్న ఉదయమే.. హైదరాబాద్‌లో లక్నో ఫ్లైట్ ఎక్కడం… చాలా మందిని ఆశ్చర్య పరించింది. అత్యంత వ్యూహాత్మకంగా.. మాయావతితో ఏపీలో రాజకీయ పొత్తులు పెట్టుకుంటున్నారని.. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పబోతున్నారని.. జనసేన వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. దానికి తగ్గట్లుగానే…పవన్ కల్యాణ్… కూడా.. తన వెంట భారీ బృందాన్ని… లక్నోకు తీసుకెళ్లారు. నాదెండ్ల మనోహర్ తోపాటు.. దళిత వర్గానికి చెందిన ప్రముఖ విద్యావేత్తలు, ఉస్మానియా విద్యార్థులను కూడా తీసుకెళ్లారు. అక్కడ మాయావతితో పాటు.. బీఎస్పీ అగ్రనేతలతో చర్చలు జరుపుతారని.. కాపు – దళిత సమ్మేళనం పూర్తవుతుందని.. ఇక ఏపీని దున్నేయడమే మిగిలిందన్నతంగా హడావుడి చేశారు.
కానీ పవన్ కల్యాణ్ లక్నోలో.. అంబేద్కర్ స్మృతి వనాన్ని మాత్రం సందర్సించారు. అంతకు మించి ఎలాంటిసమావేశాలు జరపలేదు. రాజకీయ ప్రముఖులు అసలు కలవనే లేదు. మాయావతి.. కాదు బీఎస్పీకి చెందిన… వీర్ సింగ్ అనే ఎంపీ కూడా పవన్ కల్యాణ్ వద్దకు రాలేదు. వీళ్లు వెళ్లలేదు. అంబేద్కర్ పార్క్‌లో మాత్రం.. దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. మ్యూజియాన్ని సందర్శించారు. అలా… పార్క్ మొత్తాన్ని కాలినడకన సందర్శించారట. అలా సందర్శించిన రెండో వ్యక్తి పవన్ కల్యాణ్ మాత్రమేనట. ఈ విషయాన్ని జనసేన ప్రత్యేకంగా ప్రెస్ నోట్ ద్వారా తెలియజేసింది. పవన్ తో పాటు మరో పది మంది కూడా నడిచి ఉంటారు. వాళ్లు మూడు నుంచి పన్నెండో వ్యక్తి వరకూ కావొచ్చు… అది వేరే విషయం. ఈ పార్క్ చూడటానికే ప్రత్యేకంగా… లక్నో వెళ్లారా.. పవన్ కల్యాణ్.. ఇంకేమైనా రాజకీయం ఉందా..? అన్నదానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
అయితే మాయావతిని ఎందుకు కలవలేదన్నది పెద్ద పజిల్ గా మారింది. అపాయింట్మెంట్ ఖరారు చేసుకున్న తర్వాతే లక్నో వెళ్లి ఉంటారని అనుకున్నారు. కానీ అక్కడకు వెళ్లిన తర్వాత మాయవతి… తన పార్టీ జనరల్ సెక్రటరీని కలిసి వెళ్లమని చెప్పేశారట. దాంతో నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్.. బీఎస్పీ జనరల్ సెక్రటరీ మిశ్రాను కలిసి వచ్చేశారు. లక్నో చేరిన తర్వాత పార్క్‌కు వెళ్లక ముందు పవన్ కల్యాణ్…సెక్యూరిటీని వదిలి పెట్టి… రెండు గంటలకు పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ టూర్‌కు వెళ్లారనేది.. సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతున్న వ్యవహారం. పవన్ కల్యాణ్.. ఇలా.. రాష్ట్రం కాని రాష్ట్రంలో ఎవర్ని కలవడానికి అంత సీక్రెట్ గా వెళ్లారనేది చాలా మందికి అర్థం కావడం లేదు. బహుశా.. బీజేపీకి చెందిన అగ్రనేతలెవరో.. లక్నోలో ఉన్నారని.. వారిని కలవడానికే.. ప్రత్యేకంగా వెళ్లారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పరమైన కార్యక్రమం అయితే… లక్నోకు వెళ్తున్నట్లు ప్రచారం చేసుకుని.. అక్కడ మాత్రం సీక్రెసీ ఎందుకు పాటించాలన్నది చాలా మందికి వస్తున్న సందేహం…దీనికి పవన్ కల్యాణే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.