హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీలపై మజ్లిస్ దాడి జరిగిన విషయం తెలిసిందే. “తుమ్ లోగోంకో ఇథర్ క్యా కామ్ హై” అంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్వయంగా కాంగ్రెస్ నేతల కారుపై దాడి చేయగా, ఒక కార్యకర్త కారులో కూర్చుని ఉన్న షబ్బీర్ అలీపై దాడిచేసి పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఆ దెబ్బల తాకిడికి షబ్బీర్ కన్ను కూడా కమిలిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ నేతలు, మజ్లిస్ నేతలు అనుకోకుండా ఎదురుపడటంతో ఈ దాడి జరిగిందని అందరూ అనుకున్నారు. అయితే ఆ దాడి వెనక చాలా కథ ఉందని ఇప్పుడు బయటపడింది.
అక్బరుద్దీన్ ఓవైసీపై హత్యాయత్నం చేసిన మహమ్మద్ పహిల్వాన్ ఈ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో ఓవైసీ సోదరులతో సన్నిహితంగా ఉన్న పహిల్వాన్, 2007లో వారితో విభేదాల కారణంగా మజ్లిస్ పార్టీని వీడి ఎమ్‌బీటీ పార్టీలో ఎంటరయ్యారు. 2011లో అక్బరుద్దీన్‌పై దాడి చేశారు. అలాంటి పహిల్వాన్‌ను షబ్బీర్ అలీ ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. పాతబస్తీలోని కిల్వత్ ప్రాంతంలో బహిరంగసభలో పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీనిని మజ్లిస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సభ జరపటానికి కూడా మజ్లిస్ నేతలు అభ్యంతరాలు లేవనెత్తారు. ఇక పోలింగ్ రోజును కాంగ్రెస్ అభ్యర్థి గౌస్‌ను విడిపించుకోవటానికి ఉత్తమ్, షబ్బీర్ తదితరులు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినపుడు గొడవ మొదలయింది. తమ పార్టీ నేతలు వచ్చారన్న ధైర్యంతో గౌస్, అతని అనుచరులు ఎమ్ఐఎమ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయసాగారు. ఈ సమాచారం తెలుసుకున్న అసదుద్దీన్, తన మందీ మార్బలంతో ఆఘమేఘాలపై అక్కడ వాలిపోయి దాడికి దిగారు. అదీ అసలు సంగతి!