రుషికొండపై జగన్ రెడ్డి సీఎంవో కట్టుకుంటున్నారని అయితే తప్పేంటని మంత్రి బొత్స సత్యనారాయణ తరచూ వాదిస్తూంటారు. అదీ కూడా మీడియా కెమెరాల సాక్ష్యంగానే. అయితే అక్కడ కడుతున్న ఇళ్లు.. దిగుమతి చేస్తున్న ఫర్నీచర్ చూసిన అందరికీ మైండ్ బ్లాంక్ అవుతోంది. దగ్గరకు ఎవర్నీ పోనివ్వడం లేదు కానీ.. ఇంకా బైర్లు కమ్మేంత ఖర్చుతో వాటిని కడుతున్నారు. రోడ్డు మీద నుంచే డ్రోన్ తో తీసే దృశ్యాలు చూసిన వారికి ప్రజాధనం ఎంతగా జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నారో స్పష్టమవుతుంది. పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటన తర్వాత ప్రజల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరుగుతోంది.
సెక్రటేరియట్ అని వైసీపీ ప్రకటన
రుషికొండపై కడుతున్నది సెక్రటేరియట్ అని వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ప్రకటించారు. దీన్ని చూసిన చాలా మంది ” అబ్బ.. చా ” అనుకోకుండా ఉండలేకపోతున్నారు. అక్కడ ఏమి కడుతున్నారో దైర్యంగా ప్రభుత్వం చెప్పుకోలేని దౌర్భాగ్య పాలన చేస్తూ… ఏదో ఓ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి పంపి.. రకరకాల చర్చలు జరిగేలా చేయడం తప్ప.. నిజంగా ఎందుకు కడుతున్నామో కూడా చెప్పుకోలేనంత దొంగ పాలన చేస్తోందని రుషికొండను చూస్తేనే అర్థమవుతోంది. తర్వాత సెక్రటేరియట్.. సీఎంవో రెండు ఒకటే అని అడ్డగోలు కబర్లు చెప్పినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వైసీపీకే అది సాధ్యం.
టూరిజం ప్రాజెక్టు అని చెప్పారు కదా… నిజం చెప్పలేరా ?
అసలు రిషికొండ మీద నిర్మిస్తున్నది టూరిజం ప్రాజెక్టు. ఆ పేరుతో నిధులు మంజూరు చేశారు.. అనుమతులు తీసుకున్నారు. కానీ అనుమతులకు మించి తవ్వారు.. ఇళ్లు కడుతున్నారు. అక్కడ రుషికొండకు ఏ మాత్రం హాని కలగకుండా ఉన్న రిసార్టును అడ్డగోలుగా కూల్చేసి.. రుషికొండకు బోడిగుండు కొట్టించేసి.. జగన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టించుకుంటున్నారు. కానీ.. అసలు నిజం చెప్పుకోలేని దొంగ పాలన చేస్తూ… రోజుకో విషయం లీక్ చేస్తున్నారు. ఇప్పుడ సెక్రటేరియట్ అంటున్నారు… కానీ సెక్రటేరియట్ నిర్మాణానికి… ఇంటి నిర్మాణానికి తేడా తెలియనంత అమాయకంగా జనాలు ఉంటారా ?
చేసేది చెప్పుకోలేని దొంగ పాలన చేస్తే ఏమి ? చేయకపోతే ఏమి ?
ప్రభుత్వం తాను చేసే పనులన్నీ ప్రజలకు చెప్పాలి. పారదర్శకంగా ఉండాలి. కానీ హోటల్ కడుతున్నామని సీఎం క్యాంప్ ఆఫీస్ ను కట్టుకోవడం… సెక్రటేరియట్ అని చెప్పడం.. జీవోలను రహస్యంగా ఉంచడాన్ని దొంగ పాలన అంటారు. ఈ దొంగ పాలన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే. ఎందుకంటే… ప్రజాసొమ్ము పాలకుల సొత్తు కాదు.. ప్రజలు పన్నుల రూపంలో కడుతున్న సొమ్ము.