ఆంధ్రప్రదేశ్‌లో జరిగే చిత్ర విచిత్రాలకు లాజిక్కులు ఉండవు. ఈ జాబితాలో తాజాగా మరొకటి చేరింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేశామని… పర్మినెంట్ ఉద్యోగాలని.. ముఖ్యమంత్రి జగన్ నుంచి డీజీపీ సవాంగ్ వరకూ ప్రెస్మీట్లు పెట్టి హోరెత్తించిన సచివాలయ ఉద్యోగులకు మళ్లీ పరీక్షలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారినే పర్మినెంట్ చేసి.. ప్రొబేషన్ ఇస్తారట. అదేంటి.. ఇప్పటి వరకూ వారికి పర్మినెంట్ ఉద్యోగాలు అని ప్రచారం చేశారుగా అని ఎవరికైనా అనుమానం.. అది వారి తప్పు కాదు.. ఇప్పటివరకూ వారి ఉద్యోగాలు పర్మినెంట్ కాదు. రెండేళ్ల తర్వాత పర్మినెంట్ చేస్తామన్న షరతుతో వారిని నెలకు రూ. పదిహేను వేలు ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.
ఇప్పుడు రెండేళ్ల గడువు ముగిసే సమయం వచ్చింది. వారిని నిబంధనల ప్రకారం.. ప్రొబేషన్‌లోకి తీసుకోవడం సాధ్యం కాదు. అలా తీసుకోవాలంటే చట్టబద్ధమైన నిబంధనలు పాటించాలి. లేకపోతే.. కోర్టుల్లో వారికి ఎదురు దెబ్బ తగులుతుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే వారిని పోలీసు , రెవిన్యూ, ఎలక్ట్రిసిటీ ఇలా వివిధ విభాగాల్లో తీసుకున్నారు. వారిని మళ్లీ అదే విభాగాల్లో పర్మినెంట్ చేయాలి. కానీ భర్తీ ప్రక్రియ లేకుండా ఉద్యోగాల్లో కి తీసుకుంటే .. చెల్లదు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ పరీక్షలు పెట్టాలని నిర్ణయించుకుంది. రెండు విడతలుగా పరీక్షలు పెట్టి ఉత్తీర్ణులైన వారిని మాత్రమే.. ప్రొబేషన్‌లోకి తీసుకోవాలని నిర్ణయించింది.
మొత్తం పదిహేను వేల సచివాలయాల్లో.. లక్షా 34 వేల మంది పని చేస్తున్నారు. వారందరూ మళ్లీ రెండు పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది. లేకపోతే వారి రూ. పదిహేను వేలకే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇలా పరీక్షలు పెట్టి వారికి ప్రొబేషన్ ఇచ్చినా.. అసలు వారి నియామక ప్రక్రియే చట్ట విరుద్ధంగా జరిగింది కాబట్టి.. వారి ఉద్యోగాలు ఎప్పటికీ సర్వీస్‌లోకి రావన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అదే ఇప్పుడు ఆ పర్మినెంట్ కాని పర్మినెంట్ ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారుతోంది.