సమస్యలు చెప్పుకునేందుకు.. ఏపీ సీఎం ఇంటి వద్దకు.. రోజూ… వందల మంది వస్తూండటంతో.. పోలీసులు సెక్షన్ 30 అమలు చేయడం ప్రారంభించారు. అంటే.. ముఖ్యమంత్రి నివాసం చుట్టుపక్కలకు అనుమతి లేకుండా ఎవరూ రాకూడదని.. ప్రదర్శనలు చేయకూడదన్న మాట. పాదయాత్రలో తనను కలవడానికి వచ్చిన వారందరికి హామీ ఇచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సీఎం అయిన తర్వాత అలాంటి వాళ్లంతా తన ఇంటి వద్దకు రావడాన్ని అడ్డుగా భావిస్తున్నారు. 13 జిల్లాల్లో సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించారు. అనేక వర్గాల ప్రజలను నేరుగా కలుసుకున్నారు. నాటి ప్రభుత్వ హయాంలో తమకు అన్యాయం జరిగిందంటూ ఎందరో ఆయనకు విన్నవించారు. అనేక సంఘాల నేతలు కూడా జగన్‌ను కలిసి తమ డిమాండ్లపై వినతిపత్రాలు సమర్పించారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. పాదయాత్రలో జగన్ తమకు అనేక హామీలు ఇచ్చారనీ, వాటిని అమలుచేయాలనీ కోరుతూ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి ప్రజలు బారులు తీరుతున్నారు.
కొద్ది రోజుల కిందట .. బీమామిత్ర సభ్యులు జగన్ దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా జగన్ కాన్వాయ్ వెళ్లే సమయంలో వారు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సీఎం జగన్ సాయంత్రానికి తన నివాసానికి వచ్చి వారిని పిలిపించి మాట్లాడారు. గౌరవ వేతనంతోపాటు ఒక్కొక్క బీమాకు 250 నుంచి వెయ్యి రూపాయల వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో మిగతా సంఘాలవారు కూడా తమకీ అటువంటి హామీనే కావాలని పట్టుబడుతున్నారు. వీరే కాకుండా ఇళ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, భూవివాదాలు, ఆరోగ్యశ్రీ వంటి పలు అంశాలపై సీఎం జగన్‌ను కలుసుకునేందుకు వివిధ జిల్లాల నుంచి జనం తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. గోపాలమిత్ర విషయమై వందలాది మంది జగన్ నివాసానికి చేరుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరీక్షించి ఆందోళనకి దిగారు. చివరకు సీఎం కార్యాలయ అధికారి వచ్చి వారితో మాట్లాడారు. గ్రామ వాలంటీర్ల పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా వారికి సూచించారు. ఈ హామీతో సంతృప్తి చెందలేదు. డీఎస్సీ అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలో జగన్ నివాసానికి తరలివచ్చి ఆందోళన చేశారు.
అక్కడికక్కడే నిరసనలు చేసేందుకు , విజ్ఞాపన పాత్రలు ఇచ్చేందుకు వచ్చే వారిని నిలుపుదల చేస్తున్న పోలీసులు సెక్షన్ 30 నిలుపుదల చేస్తున్నారు. రేషన్ డీలర్ల వ్యవస్థను తీసేస్తారన్న ప్రచారం జరగడంతో.. సీఎం ఇంటి ముట్టడికి వారు బయలుదేరారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే మరికొంత మంది మహిళలు.. ఇతరులను కూడా వెనక్కి పంపేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రజాదర్భార్ ఉంటుందని.. అప్పుడు రావాలని.. అప్పటి వరకూ సీఎం ఇంటి వైపు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి.. జగన్మోహన్ రెడ్డి హామీలు అమలు చేయమని వాచ్చే వారికి పోలీస్ యాక్ట్ 30ని ప్రయోగించడానికి నెల కూడా పట్టలేదు.