Sector 36 movie review
నోయిడా.. వార్తల్లో ఈ పేరు ఎప్పుడు విన్నా దేశం నిర్ఘాంతపోయిన రెండు దారుణమైన ఘటనలు డిస్టర్బ్ చేస్తాయి. నోయిడా డబుల్ మర్డర్స్ (అరుషి తల్వార్), నోయిడా సీరియల్ కిల్లింగ్స్. డబుల్ మర్డర్స్ పై ‘తల్వార్’ అనే సినిమా వచ్చింది. ఇపుడు సీరియల్ కిల్లింగ్స్ ఘటన ఆధారంగా ‘సెక్టార్ 36’ని తెరకెక్కించారు. విక్రాంత్ మెస్సి ప్రధాన పాత్రలో ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా నెట్ఫ్లిక్స్ లో రిలీజైయింది. యావత్ దేశాన్ని కలిచి వేసిన ఘటనకి కొంత కల్పన జోడించి ఈ సినిమా తీశారు. మరి ఈ ఘటన వెనుక ఎవరు వున్నారు ? హంతకుల ఉద్దేశం ఏమిటి? ఇంత దారుణానికి ఒడిగట్టటానికి కారణం ఏమిటి? నిజమైన హంతకులు చట్టానికి దొరికారా? లేదా?
ప్రేమ్ సింగ్ (విక్రాంత్ మెస్సే), బల్బీర్ సింగ్ బస్సీ(ఆకాశ్ ఖురానా) అనే బిజినెస్ ఇంట్లో పని చేస్తుంటారు. ప్రేమ్ సింగ్ కి దారుణమైన గతం వుంటుంది. ప్రేమ్ ని చిన్నప్పుడు మేనమామే లైంగిక దాడి చేసి హింసిస్తుంటాడు. ఒక రోజు మేనమామని దారుణంగా నరికి చంపేస్తాడు ప్రేమ్. అక్కడి నుంచి తనో నరభక్షకుడిగా మారిపోతాడు. ఏ దిక్కు లేని చిన్న పిల్లలని అపహరించి దారుణంగా హత మారుస్తుంటాడు. వారి శరీరభాగాలను ముక్కలుగా నరికి మురుగు కాల్వలో పడేస్తుంటాడు. ఆ ఏరియాలో అనేక మిస్సింగ్ కేసులు నమోదౌతుంటాయి. ఓ రోజు ఇన్స్పెక్టర్ రామ్ చరణ్పాండే (దీపిక్ డోబ్రియల్) కుమార్తెను ప్రేమ్ సింగ్ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి విఫలమౌతాడు. ఈ ఘటనతో అప్పటివరకూ మిస్సింగ్ అయిన పిల్లల కేసులను టేకప్ చేస్తాడు పాండే. మరి ప్రేమ్ సింగ్ ని పట్టుకోగాలిగాడా? ప్రేమ్ వెనుక ఎవరైనా బలమైన వ్యక్తులు వున్నారా? చివరికి ఈకేసుని పోలీసులు ఎలా ఛేదించారనేది మిగతా కథ.
2005, 2006 మధ్య జరిగిన నోయిడా సీరియల్ కిల్లింగ్స్ వణుకు పుట్టించాయి. సమాజంలో ఇలాంటి మృగాలు వున్నారా ? అని నిర్ఘాంతపోయేలా చేశాయి. అయితే దేశాన్ని ఇంతలా కలిచిన వేసిన కేసులో దోషిగా తేలిన ఇద్దరిని 2023లో అలహాబాద్ హైకోర్టు సాక్ష్యాధారాలు లేని కారణంగా నిర్దోషులుగా ప్రకటించింది. బహుశా ఇదే పాయింట్ దర్శకుడు ఆదిత్య నింబాల్కర్ ని ట్రిగ్గర్ చేసిందేమో.. అదే ఘటనని స్ఫూర్తిగా తీసుకోని కొంత ఫిక్షన్ ని జోడించి ‘సెక్టార్ 36’ తీశాడు. ఇప్పటివరకూ వార్తల్లో చూపించిన అంశాలతో పాటు ఇంకొన్ని కోణాలు ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
ఇది అందరికీ తెలిసిన ఘటనే కాబట్టి సైకో కిల్లర్ ప్రేమ్ సింగ్ క్యారెక్టర్ ని ఓపెనింగ్ సీన్ లోనే రివిల్ చేశాడు. బేసిగ్గా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో సైకో ఎవరని తెలుసుకోవడమే పెద్ద సస్పెన్స్. కానీ ఇది రియల్ గా జరిగిన కథ, అందుకే అలాంటి సినిమాటిక్ ట్రీట్మెంట్ జోలికిపోకుండా సజత్వానికి దగ్గరగా ఒక డాక్యుమెంటరీలానే కథనం నడిపాడు. ఇన్స్పెక్టర్ రామ్చరణ్ పాండే మిస్సింగ్ కేసుని టేకాఫ్ చేయడంతో కథ ఆసక్తిగా మారుతుంది. ఇక్కడినుంచే కొన్ని హిడెన్ సీక్రెట్లు బయటికి వస్తాయి.
ఈ కేసులో బయటికి సైకో కిల్లర్ ప్రేమ్ నేరపవృత్తి కనిపిస్తుంది. నిజంగా తను ఓ నరరూప రాక్షసుడే. దిక్కులేని పిల్లల్ని చంపి వారికి మోక్షం ఇస్తున్నాని చెప్పుకోవడం అతడిలోని ఉన్మాదానికి పరాకాష్ట. అయితే బల్బీర్ సింగ్ బస్సీ క్యారెక్టర్ ఇంకో కొత్త కోణం ఆవిష్కరిస్తుంది. వాస్తవ ఘటన దర్యాప్తులో విచారణ సరిగ్గా జరగలేదని, ఈ కేసులోని మరో నిందితుడు సంఘంలో పలుకుబడి వున్న వ్యక్తికావడంతో అతన్ని సైడ్ చేయడానికి విచారణ అధికారులు సహకరించారనే ఆరోపణలు వున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం వుందనే కోణంలో కొన్ని సన్నివేశాలు వస్తాయి.
కథా గమనానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో వుండే చురుకుదనం సెకండ్ హాఫ్ లో లోపిస్తుంది. ప్రేమ్ వాంగ్మూలం సుదీర్గంగా సాగుతుంది. దాని తర్వాత ఈ కథ అయిపోతుంది. అయితే ఇక్కడే దర్శకుడి ఫిక్షన్ యాడ్ అవుతుంది. ఇన్స్పెక్టర్ రామ్చరణ్ పాండే క్యారెక్టర్ కి ఇచ్చిన ముగింపు సిస్టమ్ ని, కరప్షన్ ని ఎత్తిచుపూతుంది. ఆధారాలని మాయం చేయడానికి, బలమైన నిందితులని తప్పించడానికి సిస్టంలోని వ్యక్తులే సాయం చేశారనే దర్శకుడి ఉద్దేశం కావచ్చు. ‘బొద్దింక ఎంత బలిసినా అది బూటు కింద నలిగిపోవాల్సిందే’అనే డైలాగ్ దర్శకుడు చెప్పదలచుకున్న సారాన్ని తెలియజేస్తుంది.
సైకో కిల్లర్ పాత్రలు చేయడం ఇమేజ్ పరంగా ఓ ఛాలెంజ్. అయితే నటుడు అన్నీ రకాల పాత్రలు చేయాలనే తపనతో విక్రాంత్ మెస్సే ఈ క్యారెక్టర్ చేశారేమో అనిపిస్తుంది. ఈ పాత్ర ఆయన నటనలో కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. పోలీస్ స్టేషన్ లో జరిగే సుదీర్ఘమైన సన్నివేశంలో విక్రాంత్ నటన మరో స్థాయిలో వుంది. అసలు తను ఎంత పెద్ద నేరం చుస్తున్నాడో తెలియని అమాయకత్వంలో వుండే ఆ పాత్రని అంతే అర్గానిక్ గా పోషించాడు. ఇన్స్పెక్టర్ రామ్ చరణ్పాండే గా దీపిక్ డోబ్రియల్ కి ఇది కొత్త రకం పాత్రే. ఇప్పటివరకూ కామెడీ రోల్స్ లో చేసిన ఆయన ఇందులో ఇంటెన్స్ పోలీస్ గా కనిపిస్తాడు. బల్బీర్ సింగ్ బస్సీ గా ఆకాశ్ ఖురానా పాత్ర కూడా బాగానే కుదిరింది. ఆనాటి ఘటనలో కనిపించిన వ్యక్తుల డ్రెస్సింగ్ గుర్తుకు తెచ్చేలా ఈ పాత్రల కాస్ట్యూమ్ డిజైన్ చేయడం బావుంది. వాస్తవ పరిస్థితులతో రిలేట్ అయ్యేలా చేసింది. నేపధ్య సంగీతం, కెమరాపనితనం డీసెంట్ వున్నాయి. శ్రీకర్ ప్రసాద్ ఎంగేజింగ్ గా ఎడిట్ చేశారు.
రక్తపాతం, హింస వున్న డిస్టర్బ్ సినిమా ఇది. పిల్లల్ని హింసించే సీన్స్ ని సున్నిత మనస్కులు భరించలేరు. రక్తపాతాన్ని చూడలేని ఆడియన్స్ ఈ సినిమాని స్కిప్ చేయడం మంచిది. రియల్ క్రైమ్ స్టోరీస్ చూడగలిగే ఆడియన్స్, నోయిడా సీరియల్ కిల్లింగ్స్ గురించి ఇంకాస్త తెలుసుకోవాలనుకుంటే మాత్రం ‘సెక్టార్ 36’లో కొన్ని కొత్త కోణాలు చూడొచ్చు.