సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా బరిలో దించిన కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కు భంగపాటు తప్పదా..? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి.
సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. బీజేపీ తరఫున కిషన్ రెడ్డి మరోసారి గెలిచి మరోసారి కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ సికింద్రాబాద్ ను ఆశించిన మేర అభివృద్ధి చేయలేదని ఆయనపై జనాల్లో అసంతృప్తి ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఈ నేపథ్యంలోనే బొంతు రామ్మోహన్ ను కాదని దానం నాగేందర్ ను కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో పెట్టిందని…ఇదంతా కిషన్ రెడ్డి – రేవంత్ ఒప్పందంలో భాగంగా జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
దానం నాగేందర్ కంటే బొంతుకే ఎక్కువ గెలుపు అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ బొంతుకు టికెట్ నిరాకరించడం వెనక కిషన్ రెడ్డి తెరవెనక చక్రం తిప్పారన్న ప్రచారం జరుగుతోంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పిటిషన్ పైకొద్ది రోజుల్లో విచారణ జరగనుంది. కోర్టు దానంపై అనర్హత వేటు వేస్తె నామినేషన్ పర్వం కూడా ముగియడంతో కాంగ్రెస్ పరిస్థితి ఏంటని చర్చ జరుగుతోంది.
ఈ ఎన్నికల్లో సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ కనీస పోటీనివ్వదనుకున్నా…అభ్యర్థిగా పద్మారావును ఎంపిక చేయడం ఆ పార్టీకి ప్లస్ అయింది. బీజేపీ కన్నా ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినా పద్మారావు తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో పద్మారావు గౌడ్ కున్న ఆదరణ, ఆయన ప్రచారశైలితో బీజేపీని వెనక్కి నెట్టి బీఆర్ఎస్ మొదటి ప్లేసుకు చేరుకుందని లేటెస్ట్ సర్వేలో తేలింది. ఇటీవల కేసీఆర్ కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పొరపాటు – బీజేపీ అభ్యర్థిపై వ్యతిరేకత బీఆర్ఎస్ అభ్యర్థికి ఆదరణ కారు పార్టీకి ప్లస్ గా మారాయని తెలుస్తోంది.