సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు రియల్ ఎస్టేట్ రంగానికి తిరుగులేని బూస్ట్ ను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. మెట్రో విస్తరణలో భాగంగా నార్త్ సిటీ వైపు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్‌లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్-2 ‘బి’లో భాగంగా కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించవలసిందిగా హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఆదేశించారు.
ప్యారడైజ్ నుంచి మేడ్చల్‌తోపాటు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్‌కు మెట్రోను విస్తరించనున్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జేబీఎస్ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు మార్గాల్లో డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. మెట్రో ఫేజ్-2 ‘ఏ’ భాగం లాగే ‘బి’ భాగాన్ని కూడా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించనున్నారు. దాదాపు 5 లక్షల మంది ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు అంచనా. నాగోల్ -RGIA ఎయిర్ పోర్ట్ వరకు, రాయదుర్గం -కోకాపేట్ నియోపోలిస్ వరకు, పటాన్ చెరు, హయత్ నగర్, ఫోర్త్ సిటీ కి కలిపేలా ఇప్పటికి డీపీఆర్‌లు రెడీ చేశారు. మేడ్చల్ మెట్రో వాటికి అదనంగా జత చేయనున్నారు.
రియల్ ఎస్టేట్ రంగం మేడ్చల్ వైపు శరవేగంగా విస్తరిస్తోంది. రవాణా సదుపాయాలు బాగున్నప్పటికీ.. మెట్రో లేకపోవడం అనేది లోటుగా ఉండేది. ప్రభుత్వ ప్రణాళికల్లోనూ లేకపోవడంతో ఎప్పుడూ చర్చకు రాలేదు. హఠాత్తుగా రేవంత్ రెడ్డి మెట్రో ప్రణాళికలు సిద్ధం చేయడంతో అటు వైపు రియల్ ఎస్టేట్ రంగం మరింత వృద్ధి నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.