పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులందరూ దూకుడు పెంచారు. ఎండను సైతం లెక్క చేయకుండా గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. సికింద్రాబాద్ లో హ్యాట్రిక్ విజయాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉండగా… తన అడ్డాలో గెలుపొందాలని బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రచారంలో డోస్ పెంచారు.కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ మాత్రం ఎక్కడ కనిపించకపోవడం చర్చనీయంశం అవుతోంది. బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ దానం నాగేందర్ ను అభ్యర్థిగా ప్రకటించినా ఆయన ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడంపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వ్యవహారం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారిందని కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. దానం పెడుతోన్న కండిషన్లపై హైకమాండ్ ఆగ్రహంగా ఉందని..అయన స్థానంలో మరొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ప్రచారంలో దానం ఎక్కడ కనిపించకపోవడంతో క్యాడర్ గందరగోళానికి గురి అవుతోంది. దానం అసలు పోటీలో ఉంటాడా..? కొత్త అభ్యర్థిని ప్రకటిస్తారా..? అనేది క్లారిటీ లేకపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురి అవుతున్నారు. వాస్తవానికి ఇక్కడి నుంచి మొదట జీహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ ను అభ్యర్థిగా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు లీకులు ఇచ్చాయి. కానీ , దానం కాంగ్రెస్ లో చేరికతో ఆయనను బలమైన అభ్యర్థిగా భావించి పేరును ఖరారు చేశారు.
ఎంపీ ఎన్నికల్లో ఓడితే తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన షరతులు పెట్టినట్లుగా తెలిసింది. కానీ, ఇందుకు కాంగ్రెస్ సుముఖంగా లేకపోవడంతో దానం ఎంపీ ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొనడం లేదనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా.. దానం అభ్యర్థిత్వంపై పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి. పార్టీని నమ్ముకున్న వాళ్ళను కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఎలా ఇస్తారని అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వీటన్నింటిపై చర్చించి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థిని మార్చాలనే యోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దానం స్థానంలో బొంతు రామ్మోహన్ లేదా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మిని బరిలో దింపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాల భోగట్టా. దానం ప్రచారంలో పాల్గొనకపోవడమే ఇందుకు సాక్ష్యమని ఉదాహరిస్తున్నారు.