కుర్రకారు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా గోవాలో వాలిపోవాలని ప్లాన్ చేస్తుంటారు. అక్కడి సముద్ర అందాలు మదిని మైమరిపింపజేస్తుంటాయి. రిలాక్స్ మూడ్ లోకి వెళ్లేందుకు యువత ఎంచుకునే మొదటి ఛాయిస్ ఏదైనా ఉందంటే అది గోవానే. అందుకే నిత్యం సందర్శకులతో గోవా కళకళలాడుతుంది.
వరల్డ్ టూరిస్ట్ ప్లేస్ అయిన గోవాకు హైదరాబాద్ నుంచి నేరుగా ట్రైన్ సౌకర్యం లేకపోవడంతో బస్సులు, సొంత వాహనాల్లో ఎక్కువగా వెళ్ళడం చూస్తుంటాం. ట్రైన్ సదుపాయం ఉంటే తక్కువ ఖర్చుతో తెగ ఎంజాయ్ చేయవచ్చునని అనుకోనివారు ఎవరూ ఉండరు. అలాంటి వారి కల ఎట్టకేలకు సాకారం కానుంది. గోవా లవర్స్ కు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
సికింద్రాబాద్ – గోవాకు వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసిపోవడం, చాలామంది సీట్లు దొరక్క ఇబ్బందులు ఎదుర్కోవడం గమనించి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. దీనిపై రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించి రైల్వేను కేటాయించినట్లు వెల్లడించారు.
ఈ ట్రైన్ వీక్లీ బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై, గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి బయల్దేరుతుంది. కాచీగూడ, షాద్ నగర్, జడ్చర్ల,మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్ తదితర స్టేషన్ లలో ఆగుతుందని తెలుస్తోంది.