టీవీ9లో మళ్లీ యాజమాన్యమార్పు లాంటి వివాదం ఏమైనా చోటు చేసుకోబోతోందా..? ఎందుకీ పోలీసుల హంగామా..? హఠాత్తుగా లోగో మార్పునకు.. ఆఫీసు చుట్టూ పోలీసుల మోహరింపులకు సంబంధం ఉందా..? … రెండు రోజుల నుంచి టీవీ9 కార్యాలయం చుట్టూ మోహరించి ఉన్న పోలీసుల్ని చూస్తే.. చాలా మందికి ఇవే అనుమానాలు వస్తున్నాయి. ఎప్పుడూ లేని పెద్ద ఎత్తున టీవీ9 కార్యాలయానికి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడెవరూ ఆ చానల్ పై దాడి చేస్తామని ప్రకటనలు చేయలేదు. అలాగని.. గతంలో ఉన్న యాజమాన్య వివాదాలు కూడా లేవు. అయినప్పటికీ యాజమాన్యం.. పెద్ద ఎత్తున పోలీసుల సాయం తీసుకుంటోంది.
బహుశా.. రేవంత్ రెడ్డి వర్గీయులు దాడి చేస్తారన్న సమాచారం ఉండటంతోనే.. ఇలాంటి భద్రతా ఏర్పాట్లు చేసి ఉంటారన్న అనుమానామాలు మీడియా వర్గాల్లో ఏర్పడ్డాయి. కొద్ది రోజుల నుంచి.. టీవీ9కి కరోనా కంటే.. రేవంత్ రెడ్డే ప్రమాదకర వైరస్‌లా కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎంత ప్రమాదకారినో చెబుతూ.. గంటల తరబడి ప్రసారాలు చేస్తున్నారు. ఇవన్నీ.. తప్పుడు వార్తలని.. ఫేక్ న్యూస్‌తో రేవంత్ ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు ఆయన వర్గీయుల నుంచి వస్తున్నాయి. అదే కారణంతో టీవీ9పై దాడి చేస్తారేమోనన్న ఉద్దేశంతో.. పోలీసుల్ని మోహరించినట్లుగా చెబుతున్నారు.
డ్రోన్ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పది రోజులు దాటిపోయింది. హైకోర్టులో రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోనుంది. అసలు డ్రోన్ కేసులో.. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారన్న వాదన.. రవంత్ వర్గీయులు వినిపిస్తున్నారు. రేవంత్ కోసం ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్లను.. ఏఐసిసి పంపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు ఏ క్షణమైనా బెయిల్ వచ్చే అవకాశం ఉందని.. ఈ సమయంలో.. టీవీ9కి మరింత భద్రత అవసరమని.. యాజమాన్యం గుర్తించినట్లుగా చెబుతున్నారు.