పఠాన్ కోట్ పై పాక్ ఉగ్రవాదులే దాడి చేసారనే విషయంలో ఎవరికీ భినాభిప్రాయలు లేవు కాని భారత దేశానికి అత్యంత కీలకమయిన, వ్యూహాత్మకమయిన యుద్ద వైమానిక స్థావరాలలో ఒకటయిన పఠాన్ కోట్ లో పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు ఉండగా ఉగ్రవాదులు ఏవిధంగా లోపలకి జొరబడగలిగారు? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ దాడులకు కుట్రలు పన్నిన వారు పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్నారు కనుక బహుశః వారిని ఎన్నటికీ భారత్ పట్టుకోలేకపోవచ్చు. భద్రతాపరమయిన లోపాలను గుర్తించేందుకు కేంద్ర హోం శాఖ ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. అది నిన్న హోంశాఖకు సమర్పించిన నివేదికలో చాలా లోపాలను ఎత్తి చూపింది.
మొట్టమొదటిగా మన ఉగ్రవాద నిరోధక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని పేర్కొంది. పాక్ ఉగ్రవాదులు మన రక్షణ స్థావరాలలో కీలకమయిన దానిపై దాడులు చేసే అవకాశం ఉందని నిఘావర్గాల పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ పఠాన్ కోట్ చుట్టూ మొహరించి ఉన్న భద్రతాదళాలు అప్రమత్తం అవకుండా తీవ్ర అలసత్వం ప్రదర్శించాయని తన నివేదికలో పేర్కొంది. అలాగే నిఘా వర్గాల నుంచి ఎప్పటికప్పుడు చాలా ఖచ్చితమయిన సమాచారం అందుతున్నప్పటికీ, పంజాబ్ పోలీసులు కూడా అప్రమత్తం అవకపోవడం చాలా సందేహాలు కలిగిస్తోందని పేర్కొంది. పఠాన్ కోట్ ఎస్పిని, ఆయన అనుచరుడిని ఉగ్రవాదులు అపహరించుకొనిపోయి, విడిచిపెట్టేసిన తరువాత వారి నుండి ఎన్.ఇ.ఏ. అధికారులు ఉగ్రవాదుల గురించి చాలా కీలకమయిన సమాచారం రాబట్టి దానిని స్థానిక పోలీస్ ఉన్నతాధికారులకు, పటాన్ కోట్ వైమానిక స్థావరానికి రక్షణ కల్పిస్తున్న భద్రతాధికారులకు తెలియజేశారు. అయినప్పటికీ ఎవరూ అప్రమత్తం కాలేదని నివేదికలో పేర్కొంది. అందుకే పాక్ ఉగ్రవాదులు చాలా సులువుగా పఠాన్ కోట్ లోపలకి జొరబడగలిగారని నివేదికలో పేర్కొంది. కనుక ఇప్పటికయినా మన ఉగ్రవాద నిరోధ, భద్రతా వ్యవస్థలను మరింత కట్టుదిట్టం చేయడం చాలా అవసరమని నివేదికలో పేర్కొంది.
స్టాండింగ్ కమిటీ ఇచ్చిన ఈ నివేదికని బట్టి చూస్తే మన బంగారం మంచిది కాకపోతే ఇంకా ఎవరిని అని ఏమి ప్రయోజనం అన్నట్లుంది. పాక్ ఉగ్రవాదుల దాడుల తరువాత, ఆ దాడులకు కుట్ర పన్నిన జైష్-ఎ-మహమ్మద్ అధినేత మసూద్ అజహర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ “భారత్ భద్రతా వ్యవస్థని చేదించడం తమకేమీ పెద్ద కష్టం కాదు” అని చెప్పాడంటే మన భద్రతా వ్యవస్థ ఎంత బలహీనంగా, లోపభూయిష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ కూడా అదే మాట చెప్పింది. మనలో ఇన్ని లోపాలు పెట్టుకొని వాటిని సవరించుకోలేకపోతే ఇంక ఉగ్రవాదులను పాకిస్తాన్ని ఆడిపోసుకొంటే ఏమి ప్రయోజనం. ఇప్పటికయినా సమూల ప్రక్షాళన చేయడం మంచిది. లేకుంటే మళ్ళీ మరొకసారి ఇటువంటి దాడులు పునరావృతం అయితే, ప్రపంచ దేశాలు మనల్ని చూసి నవ్వుకొంటాయి.