మా ప్రాంతాన్ని కర్ణాటకలో కలిపేయండి.. ! ఈ గోల అంతా ఎందుకు..? అంటున్నారు.. కర్ణాటక శివారు నియోజకవర్గాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ నేతలు. కర్నూలు జిల్లా మంత్రాలయంతో పాటు అనంతపురం జిల్లా హిందూపురం, పెనుకొండ వంటి ప్రాంతాలు.. కర్ణాటకకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. అనంతపురం ప్రాంతాలు.. బెంగళూరుకు చాలా దగ్గరగా ఉంటాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం అయితే.. పూర్తిగా కర్ణాటక వాతావరణంతో ఉంటుంది. అక్కడ ఉన్న మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వచ్చే వారంతా కర్ణాటక భక్తులే. చాలా పరిమితంగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు వెళ్తూంటారు. ఇప్పుడు ఆ మంత్రాలయం నియోజకవర్గానికి చెందిన నేత తిక్కారెడ్డి తమ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలంటున్నారు. పెనుకొండ టీడీపీ నేత.. పార్థసారధి కూడా అదే డిమాండ్ వినినిపించారు.
ఇలా.. కర్ణాటకలో తమ ప్రాంతాలను కలపాలంటున్న నేతలు.. వాటికి సాంస్కృతిక, సామాజిక పరిస్థితుల్ని కూడా సాక్ష్యాలుగా చూపిస్తున్నారు. మంత్రాలయంలో.. ఎవరూ తెలుగు సంప్రదాయాలు పాటించరని.. అందరూ కన్నడ సంస్కృతి, సంప్రదాయాలనే పాటిస్తారని.. తిక్కారెడ్డి అంటున్నారు. ఇప్పుడు.. మంత్రాలయం ప్రజలు.. రాజధాని విశాఖకు వెళ్లాలంటే.. వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించాలని.. ఇరవై గంటలు పడుతుందని.. అంత కష్టం తమకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇతర నేతల వాదన కూడా ఇదే. అయితే.. ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్న వారంతా.. టీడీపీ నేతలే. గంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలే నోరెత్తలేకపోతున్నారు కాబట్టి.. వైసీపీ సీమ నేతలు నోరెత్త అవకాశం లేదు. వారి వాయిస్ వినిపించే అవకాశం లేదు. కానీ వారికీ అలాంటి అభిప్రాయం ఉందన్న చర్చ జరుగుతోంది.
మూడు రాజధానుల అంశంతో.. వైఎస్ జగన్.. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టారనే విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. అడగకపోయినా.. తమ ప్రాంతానికి రాజధాని ప్రకటించారన్న భావన విశాఖ ప్రజల్లో ఉంది. తమ దగ్గర్నుంచి అనవసరంగా తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం అమరావతి ప్రజల్లో ఏర్పడింది. తమకు రాని హైకోర్టును బిస్కెట్ గా వేశారన్న అభిప్రాయం సీమ ప్రజల్లో ఏర్పడింది. దీంతో ఒక ప్రాంతంపై మరో ప్రాంతం ప్రజలు విమర్శలు చేసుకోవడం ప్రారంభించారు. చివరికి ఇది.. ఈ తిప్పలన్నీ ఎందుకు తమ ప్రాంతాన్ని పక్క రాష్ట్రంలో కలిపేయమనే డిమాండ్లు పెరగడానికి కారణం అవుతోంది. రాజకీయం ఎంత వరకైనా తీసుకెళ్లగలదు మరి..!