రాయలసీమకు చెందిన కొందరు కాంగ్రెస్, వైకాపా నేతలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం మొదలుపెట్టబోతున్నట్లు, వారికి వైకాపా సీనియర్ నేత ఎం.వి. మైసూరా రెడ్డి నేతృత్వం వహించాబోతున్నట్లుగా ఆ మధ్య వార్తలు వచ్చేయి. దాని కోసం ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి ఈనెల 21న రాయలసీమ సాధన సమితిని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వచ్చేయి. కానీ తీవ్ర విమర్శలు రావడంతో మైసూరా రెడ్డితో సహా అందరూ వెనక్కి తగ్గినట్లున్నారు.
జగన్మోహన్ రెడ్డి తన పార్టీ మనుగడ కోసం ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నించి విఫలమవడంతో, ఆయనే తన పార్టీలోని రాయలసీమ నేతలను ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం పోరాటం ప్రారంభించమని ప్రోత్సహించి ఉంటారని, తెదేపా నేతలు అనుమానాలు వక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ నిరుద్యోగులు కూడా వైకాపాకు తోడవడంతో ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టి ఉండవచ్చని తెదేపా నేతలు ఆరోపించారు. కాంగ్రెస్, వైకాపా రెండు పార్టీలు తమ రాజకీయ మనుడగ కోసం ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ రాష్ట్రంలో చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నాయని తెదేపా నేతలు చేసిన విమర్శలతో ఆ రెండు పార్టీల నేతలు వెనక్కి తగ్గినట్లున్నారు.
తెదేపా నేతల విమర్శల వలన ఇప్పటికే రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎన్నటికీ కోలుకోలేనివిధంగా నష్టం జరుగుతుందని గ్రహించిన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తమ పార్టీ ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర ఉద్యమానికి మద్దతు ఈయదని విస్పష్టంగా ప్రకటించారు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు ఎవరయినా ఆ ఉద్యమంలో పాల్గోన్నట్లయితే దానికీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ప్రకటించారు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెదేపా విమర్శలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం వలన వారు చేస్తున్న ఆరోపణలు నిజమేనని అనుమానించవలసి వస్తోంది. కానీ మైసూరా రెడ్డి పార్టీని వీడకపోవడం, రాయలసీమ ఉద్యమం గురించి ఆయన కూడా మౌనం వహించడం గమనిస్తే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకొన్నట్లుంది.
రాయలసీమ గురించి మొసలి కన్నీరు కార్చుతున్న నేతలందరూ ఇన్నేళ్ళుగా అధికారంలో ఉన్నప్పుడు తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొనే ప్రయత్నాలు చేయలేదు. చేసి ఉండి ఉంటే తమ రాజకీయ మనుగడ కోసం ఇటువంటి ‘ప్రత్యేక ఆలోచనలు’ చేయవలసిన అవసరమే ఉండేది కాదు. ప్రజలే వారిని తమ నెత్తిన పెట్టుకొని ఆదరించి ఉండేవారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెదేపా నేతలు వీలయినంత త్వరగా, ఎక్కువగా రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రా జిల్లాలను అభివృద్ధి చేసుకొంటే మున్ముందు వారికీ ఇటువంటి దుస్థితి ఎదుర్కొనే అవసరం ఉండదు.