ఆగస్టు రెండో వారం వచ్చింది. రాయలసీమలో వర్షాలు అనుకున్నంతగా పడలేదు. రైతులు వేసిన పంటలు ఎండిపోయేదశలో ఉన్నాయి. శ్రీశైలం నుంచి చుక్క నీరు విడుదల చేయడం లేదు. ఇటీవల వచ్చిన వర్షాల కారణంగా శ్రీశైలంలో వంద టీఎంసీలకుపైగా నీరు ఉంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. నీటిని దిగువకు వదులుతోంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం… శీశైలం నుంచి రాయలసీమకు వదిలే ప్రయత్నం చేయడం లేదు. తెలంగాణ నీటిని వృధా చేస్తోందని… కృష్ణాబోర్డుకు లేఖలు రాసి కడుపులో చల్ల కదలకుండా కూర్చుంది.
ఎప్పట్లాగే గోదావరికి వరదలు వచ్చినా… పట్టిసీమ ద్వారా ఆ నీటిని కృష్ణాడెల్టాకు పంపడంలో ఫెయిలయ్యారు. పట్టిసీమను రెండు, మూడు రోజుల పాటు మాత్రమే ఆన్ చేశారు. గోదావరి నీరు అంతా సముద్రంలోకి వెళ్లిపోయింది. కృష్ణాడెల్టాకు ఇంకా వరద రాలేదు. వర్షాల వల్ల వచ్చిన వరద ఎగువ ప్రాజెక్టుల్లోనే ఆగిపోయింది. కర్ణాటకలో కృష్ణాపై ప్రాజెక్టులు నిండాయి. వారు చక్కగా పంటలకు నీరు విడుదల చేసుకుంటున్నారు. కానీ దిగువన రాయలసీమ రైతులు మాత్రం నష్టపోతున్నారు.
అయితే నీటిని తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని.. లేఖలు రాసి వదిలేస్తే ఎలా అని సీమ మేధావులు మండిపడుతున్నారు. వేల ఎకరాల్లో పలు రకాల పంటలకు ఇప్పుడు నీరు అవసరం . ట్యాంకర్లతో పంటలను కాపాడుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నారు. తెలంగాణలో విద్యుత్ సమస్య లేకుండా.. చూసేందుకు అక్కడి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నికల ముంగిట.. ప్రజలకు అసౌకర్యం రాకుండా చూసుకోవాలి అనుకుంటోంది. రాయలసీమ ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణకు సహకరిస్తోందన్న అరోపణలు వినిపిస్తున్నాయి.