గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో నిర్ణయాత్మక పాత్ర వహించగల సామర్ధ్యం నగరంలో వుంటున్న సీమాంధ్రులకు తప్ప ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్లకు లేదు. ఉద్వేగ పూరితమైన భావసమైక్యత లేదా తెలుగువారి దాయాదిపోరు ఇతర సెటిలర్లకు లేకపోవడమే ఇందుకు మూలం.
హైదరాబాద్ కి నాయకత్వం వహించాలన్న ఆకాంక్ష సగటు సీమాంధ్రులకు లేదు. అయితే ఈ నగరంలో తమ ఉనికిని బలంగా చూపించుకోవాలన్న కోరిక మాత్రం వీరిలో చిన్న ఎమోషన్ గా బలపడుతోంది. ”ఆంధ్రోళ్ళు, మీ కాడికి పొండి” అన్న హేళనలకు, టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిన వివక్షకు, అవమానాలకు బదులు తీర్చుకునే తరుణంగానే హైదరాబాద్ ఎన్నికలను స్ధానిక సీమాంధ్రులు భావిస్తున్నారు. ”తండ్రీకొడుకులు పెడుతున్న కితకితలు చికాకు పుట్టిస్తున్నాయని” కెసిఆర్, కెటిఆర్ లను ఉద్దేశించి పలు కాలనీల వారు న్యూస్ టివిలలో చెబుతున్నారు. వాళ్ళమాటల్ని మరచిపోలేము అంటున్నారు.
150 డివిజన్లుగా వున్న హైదరాబాద్ లో ఏటా 4 వేల కోట్లరూపాయల పనులు జరుగుతాయి. పనులను చర్చించి నిధులను ఖరారు చేసే కార్పొరేషన్ లోవుండే అవకాశంకోసం కార్పొరేషన్ రాజకీయాల్లో ప్రవేశం వున్నవారు గట్టి ప్రయత్నాల్లో వున్నారు. 73 లక్షల మంది ఓటర్లు 150 మందిని ఎన్నుకోవలసి వుంది. ఓటర్లలో 40 శాతం మంది సీమాంధ్రులే! మొత్తం 150 డివిజన్లకు 60 డివిజన్లలో సీమాంధ్రుల ప్రాబల్యం విశేషంగా వుంది. ఈ డివిజన్లలో వీరిలో మెజారిటీ తెలుగుదేశం పార్టీకే ఓటు వేసే అవకాశాలు ఎక్కువ. ఇతర డివిజన్లలో కూడా సీమాంధ్రులు టిఆర్ఎస్ ను ఓడించే పార్టీలకు లేదా శక్తులకు ఓటు వేసే అవకాశాలు వున్నాయి. కాంగ్రెస్ కూడా ఓట్లు చీల్చడంద్వారా టిఆర్ ఎస్ ను బలహీనపరుస్తుంది.
సీమాంధ్రుల ఎలక్షన్ మూడ్ తప్ప తెలుగుదేశానికి ఇపుడు హైదరాబాద్ లో కేడర్ మినహా వేరే బలం లేదు. ఓటునోటు కేసు వల్ల చంద్రబాబు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కు సరండర్ అయిపోయారన్న భావం విస్తృతంగానే వుంది. తెలుగుదేశం బిజెపి పార్టీలు మిత్రపక్షాలే అయినా తెలంగాణాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు విభజనకు ముందు నుంచీ సీమాంధ్ర సెటిరల్ల సమస్యల పట్ల ఉదాసీనంగానే వున్నారు. ఆయన ”తెలంగాణా మొగ్గు” హైదరాబాద్ లో సీమాంధ్రులను బిజెపికి కొంతదూరంగానే వుంచింది.
సెంటిమెంటే బలంగా వున్న నెపధ్యంలో బిజెపి తెలుగుదేశం రూపొందించే వుమ్మడి వ్యూహాలు ఉత్తమ అభ్యర్ధుల ఎంపిక ఈ శిబిరానికి అదనపు బలాలు అవుతాయి. ఇదంతా కెసిఅర్ కు క్షుణ్ణంగా తెలుసు. రాష్ట్రరాజధాని లో స్ధానిక స్వపరిపాలనా సంస్ధ మీద టిఆర్ఎస్ విజయ పతాకం మాత్రమే కనిపించాలన్నది ఆయన ఉద్దేశం…ఆయన ప్రయత్నం.అయితే తెలుగుదేశం బిజెపి పార్టీల ఆధిక్యత – తీసిపారేయలేనంతగా కనబడుతూంది.
సీమాంధ్రులు కాక ఇతరుల్లో టిఆర్ ఎస్ ను వ్యతిరేకించేవారు కాంగ్రెస్ కి అదనపు బలం అవుతారు. ఏకకాలంలో రెండు ప్రత్యర్ధి శిబిరాలను ఎదుర్కోవడంలో వున్న సమస్యను అభ్యర్ధుల ఎంపిక ద్వారా తగ్గించుకోవాలని కెటిఆర్ భావిస్తున్నారు. ఫలితాలు ఎలావున్నా ఎన్నికైన వారిని మూకుమ్మడిగా ”ఆకర్షించే” శక్తి, సామర్ధ్యం మాత్రమేకాక అధికారం కూడా టిఆర్ఎస్ కి వుంది.