తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అసెంబ్లీ సీట్లను పెంచుతుందో లేదో కానీ.. ప్రతీ నెలా మాత్రం ఢిల్లీ నుంచి లీకులొస్తున్నాయి. జమ్మూకశ్మీర్ విభజన బిల్లులో ఆక్కడి అసెంబ్లీ సీట్లను పెంచుతామని చెప్పారు. దాంతో.. జమ్మూకశ్మీరులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఇందుకోసం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కమిషన్ 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యస్థీకరిస్తుంది. ఒక రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూకశ్మీరులో 107 అసెంబ్లీ సీట్లు ఉండేవి. ఇవి 114కు పెరగనున్నాయి. ఈసీ ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది.
ఒక్క జమ్మూకశ్మీర్ మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలు,సిక్కిం కూడా ఈసీ దృష్టిలో ఉన్నాయని బీజేపీ నేతలు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఏపీ విభజన చట్టం ప్రకారం… తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచాల్సి ఉంది కాబట్టి.. జమ్మూకశ్మీర్‌తో పాటు.. ఆ పని కూడా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి.. కసరత్తు చేయాల్సిన బాధ్యతను.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ కీలక బీజేపీ నేతలకు.. అమిత్ షా బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు. వచ్చే వారం.. బీజేపీ అగ్రనేతలు.. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లపై.. ముఖ్యమైన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలో డిలిమిటేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని.. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్, సిక్కిం, ఏపీ, తెలంగాణలకు కలిపి …ఒకే పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు.
పునర్విభజన చట్టం ప్రకారం.. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి పెరగాల్సి ఉంది. తెలంగాణలో 153 కి చేరాల్సి ఉంది. ప్రస్తుతం లాంఛనాలన్నీ పూర్తి ేసి… వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని..బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు 2026 వరకు అసెంబ్లీ సీట్లలో మార్పులు, చేర్పులు చేయకుండ సీలింగ్ పెట్టారు. అందుకే రాజ్యాంగ సవరణ అవసరం అవుతోంది. ఇప్పుడు కేంద్రానికి రాజ్యాంగ సవరణ చేయడం.. .చాలా సువులు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించి ఆర్టికల్ 170 సవరిస్తూ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.