తెలంగాణలో కాంగ్రెస్ గెలవగానే రేవంత్ తర్వాత కేబినెట్లో చోటు దక్కించుకునే మొదటగా సీతక్క పేరే వినిపించేది. ఆమె తెలంగాణ కాంగ్రెస్ లో తన పనితీరుతో అలా కీలక స్థానానికి వెళ్లారు. రాహుల్ గాంధీతో పాదయాత్రలో పాల్గొని హైకమాండ్ అభిమానాన్ని పొందారు. అంతకంటే ఆమె స్ఫూర్తిదాయకమైన బ్యాక్ గ్రౌండ్ కూడా ప్లస్ పాయింట్ గాఉంది. అప్పుడే హోంమంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ సీనియర్లు ఉత్తమ్, కోమటిరెడ్డి, భట్టి వంటి వాళ్లు ఫీలవుతారని..హోంమంత్రిత్వ శాఖను ఎవరికీ కేటాయించలేదు.
ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ తర్వాత సీతక్కకే హోంమంత్రిత్వం ఖరారు కానుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి వరంగల్ జిల్లా ములుగు నుంచి టీడీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క… 2014లో మాజీ మంత్రి చందూలాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వరసగా గెలిచారు. అయితే 2014 తర్వాత రేవంత్‌తో కలిసి ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో మమేకం కావటమనేది ఆమెను కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలో పడేలా చేసింది.
ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఆదిలాబాద్ జిల్లాకు ఇన్ఛార్జీ మంత్రిగా సీతక్క తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పోషిస్తున్నారనే పేరును తెచ్చుకున్నారు. విధానపరమైన అంశాల్లో ఇతర మంత్రులు తమ పరిధులు, పరిమితులు దాటి మాట్లాడుతున్నప్పటికీ సీతక్క మాత్రం వాటి జోలికెళ్లకుండా తనకు అప్పగించిన పనికే పరిమితమయ్యారు. వివాదాలు లేకుండా పని చేస్తారన్న అభిప్రాయం ఉంది. మాస్ లీడర్ అయిన సీతక్కకు హోం శాఖ అప్పగిస్తే.. ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చే అవకాశం ఉంది.