‘ఉయ్యాలా జంపాలా’, ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన రాజ్ తరుణ్ లేటెస్ట్గా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో చేసిన సినిమా ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’. రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టాలనుకున్న రాజ్‌తరుణ్‌కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌నిచ్చింది? కొత్త దర్శకుడు రాజ్‌తరుణ్ కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడా? క్లాస్ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
శ్రీరామ్(రాజ్‌తరుణ్) రామచంద్రాపురంలోనే ఎందుకూ పనికిరాని కుర్రాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఇంటి పట్టున వుండకుండా ఇంటర్ పరీక్షలు మళ్ళీ మళ్ళీ రాస్తూ వుంటే శ్రీరామ్‌కి ఫ్లాష్‌బ్యాక్‌లో ఒక లవ్‌స్టోరీ వుంది. చిన్న తనంలోనే సీతామహాలక్ష్మిని ప్రేమించాడు. ఆమె ఇప్పుడు ఎం.బి.బి.ఎస్. చేస్తోంది. అప్పుడప్పుడు ఊరికి వచ్చి పోయే సీత(అర్తన)కి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు. కానీ, చెప్పలేడు. ఓరోజు ధైర్యం చేసి తన లవ్ విషయం చెప్తే చెప్పుతో కొట్టినంత పనిచేస్తుంది సీత. బేవార్స్ బ్యాచ్‌తో తిరిగే రామ్‌ని పెళ్ళి చేసుకోవడం తనకి ఇష్టం లేదని చెప్తుంది. దాంతో ఫ్రెండ్స్‌తో కలిసి పీకల దాకా తాగి చచ్చిపోతానని కత్తి తీస్తాడు. అదే టైమ్‌లో తనకి ఇష్టం లేని పెళ్ళి చూపులు ఎరేంజ్ చేస్తున్నందుకు తండ్రి మీద కోపంతో చచ్చిపోతానని ఊగిపోతుంది సీత. ఓ ఫైన్ మార్నింగ్ రామ్ ప్రేమను సీత ఓకే చేస్తుంది. అయితే తన తండ్రి హైదరాబాద్ నుంచి క్రికెటర్ వరుణ్(ఆదర్శ్) సంబంధం తెచ్చాడని, అది ఎలాగైనా చెడగొట్టమని రామ్‌కి చెప్తుంది సీత. రామ్ బ్యాచ్ హైదరాబాద్ బయల్దేరతారు. రామ్, వరుణ్‌ల మధ్య సీత విషయంలో మాటా మాటా పెరుగుతుంది. ఇద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు? వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఏమిటి? ఇద్దరూ ఏం పందెం వేసుకున్నారు? వరుణ్ని ఈ పెళ్ళి నుంచి ఎలా తప్పించారు? చివరికి రామ్, సీతల పెళ్ళికి సీత తండ్రి ఒప్పుకున్నాడా? అనేది మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్:
ఈ చిత్రంలో ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కంటే ఓవర్ యాక్షన్ ఎక్కువైందని చెప్పాలి. సినిమాలోని ప్రతి సీన్లో ఆర్టిస్టులంతా రూపాయికి రెండు రూపాయల పెర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక రాజ్ తరుణ్ పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అదే డైలాగ్ డెలివరీ, అదే పెర్ఫార్మెన్స్. అతని క్యారెక్టర్లో కొత్తదనం లేదు, పెర్ఫార్మెన్స్ కూడా కొత్తగా లేదు. సినిమాలో ఎక్కువ భాగం హీరో, అతని బ్యాచ్ సీన్సే ఎక్కువగా వుంటాయి. వారితో కామెడీ చేయించాలని డైరెక్టర్ విశ్వ ప్రయత్నం చేశాడు. కానీ, వర్కవుట్ అయింది మాత్రం చాలా తక్కువ. అది కూడా షకలక శంకర్ చెప్పిన కొన్ని డైలాగ్స్ పేలాయి తప్ప మిగతావన్నీ తుస్సే. హీరోయిన్ కళ్యాణి పోలికలతో వున్న అర్తన గురించి చెప్పాలంటే ఏమాత్రం ఎట్రాక్టివ్‌గా లేని ఫేస్‌తో, ఎలాంటి ఫీలింగ్స్ లేని ఎక్స్‌ప్రెషన్స్‌తో రకరకాలుగా పెర్ఫార్మ్ చేసింది అర్తన. ఒక విధంగా చెప్పాలంటే హీరో ఫస్ట్ హాఫ్ అంతా ఆమె ప్రేమను పొందలేక బాధపడిపోయేంత అందం కూడా ఆమె దగ్గర లేదు. ఇక మిగతా క్యారెక్టర్లన్నీ కథకు ఏమాత్రం ఉపయోగపడని ఎక్స్ట్రా క్యారెక్టర్స్‌గా చెప్పుకోవచ్చు.
టెక్నికల్ డిపార్ట్మెంట్:
ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా అయినప్పటికీ ఆ విలేజ్ బ్యూటీ అనేది ఫోటోగ్రఫీలో ఎక్కడా కనిపించదు. ప్రతి సీన్‌ని చాలా నార్మల్‌గా తీసినట్టుగా వుంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సినిమా కలర్ఫుల్గా లేదు. దాదాపు రెండుంపావు గంటలు వున్న ఈ సినిమాలో కట్ చెయ్యాల్సిన సీన్స్ చాలా వున్నా ఎడిటర్ కార్తీక శ్రీనివాస్‌కి ఆ అవకాశం ఇచ్చినట్టు కనిపించదు. కొన్ని సీన్స్ ఎందుకు వచ్చాయో అర్థం కాకుండా వుంటాయి. మ్యూజిక్ విషయానికి వస్తే గోపి సుందర్ పాటలు గొప్పగా అనిపించవు. ‘పరవశమే..’ అంటూ సాగే లవ్ సాంగ్ ఒక్కటే సినిమాలో చెప్పుకోదగిన పాట. ఆ పాటని విజువల్‌గా కూడా బాగానే తీశారనిపిస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. మూడు హిట్స్ వరసగా వచ్చిన రాజ్తరుణ్లాంటి హీరోతో ఒక ఔట్ డేటెడ్ సబ్జెక్ట్ చేశాడు డైరెక్టర్ శ్రీనివాస్. హీరోయిన్ కోసం కబడ్డీ ఆడిన జగపతిబాబు ‘కబడ్డీ కబడ్డీ’ మనం చూశాం. మళ్ళీ అదే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాడు డైరెక్టర్. దాదాపు అరగంట పాటు నడిచే క్లైమాక్స్ అంతా క్రికెట్‌తో నిండిపోయి వుంటుంది. చివరి పావుగంట మనకు క్రికెట్ మ్యాచ్ చూపించాడు. ఏ విధంగా చూసినా ఇది ఇప్పటి ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే సబ్జెక్ట్ కాదు.
విశ్లేషణ:
‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’ అనే టైటిల్‌కి సినిమా కథాంశానికి అస్సలు పొంతన లేదు. ఎందుకంటే సీతమ్మ అందాలు సినిమాలో ఎక్కడా కనిపించవు. అలాగే ఎప్పుడూ ఫ్రెండ్స్‌తో కలిసి మందు కొడుతూ వుండే రామయ్య చేసే సిత్రాలు కూడా సినిమాలో ఏమీ లేవు. ఒక సాదా సీదా సబ్జెక్ట్‌ని తీసుకొని దాన్ని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో చేసి అందర్నీ మెప్పించాలని చూసిన డైరెక్టర్ శ్రీనివాస్ సక్సెస్ అవ్వలేకపోయాడు. సినిమా మొదలైనప్పటి నుంచి పది నిముషాలు కూడా ఆడియన్స్ కథలో ఇన్వాల్వ్ అవ్వరు. కాకపోతే క్రికెట్ అంటే ఇష్టపడే వారు చాలా మంది వుంటారు కాబట్టి చివరి పదిహేను నిముషాలు క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తారు తప్ప క్రికెట్ మ్యాచ్ హీరో గెలుస్తాడా? హీరోయిన్ని పెళ్ళి చేసుకుంటాడా? లేదా? అనే టెన్షన్ ఆడియన్స్‌లో కలిగించలేకపోయాడు డైరెక్టర్. ఆడియన్స్‌కి ఎలాంటి క్యూరియాసిటీ కలిగించని సినిమా ఇది. కాకపోతే సినిమాలో అప్పుడప్పుడు పేలే కొన్ని జోక్స్‌ని మాత్రం ఎంజాయ్ చెయ్యడానికి వీలుంటుంది. ఫైనల్‌గా చెప్పాలంటే రెండో హ్యాట్రిక్‌కి శ్రీకారం చుట్టాలనుకున్న రాజ్‌తరుణ్‌ని డిజప్పాయింట్ చేసే సినిమా ‘సీతమ్మ అందాలు.. రామయ్య సిత్రాలు’.
బ్యానర్ : శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్
నటీనటులు: రాజ్ తరుణ్, అర్తన, షకలక శంకర్,
రాజా రవీంద్ర, రణధీర్, ఆదర్శ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: విశ్వ డి.బి.
సంగీతం: గోపిసుందర్
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
సమర్పణ: శ్రీమతి పూర్ణిమ ఎస్.బాబు
నిర్మాతలు: ఎస్.శైలేంద్రబాబు, కె.వి.శ్రీధర్‌రెడ్డి,
హరీష్ దుగ్గిశెట్టి
రచన, దర్శకత్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
విడుదల తేదీ: 29.01.2016
తెలుగు360.కామ్ రేటింగ్: 2.25/5