శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటేనే భావోద్వేగాల మేళవింపు. మనసుని మెలేసే సన్నివేశాల సమాహారం. కుటుంబ బంధాలు, అందులోని గొప్పదనం, సంతోషాలు, కన్నీళ్లు.. ఇవన్నీ ఆయన కథల్లో కనిపిస్తాయి. బ్రహ్మోత్సవం చిత్రంలోనూ దానికే పెద్దపీట వేశారాయన. ట్రైలర్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. క్లయిమాక్స్‌లో మహేష్ బాబు నటన కన్నీళ్లు తెప్పించిందని, అదో గొప్ప సన్నివేశమని జయసుధ ఇది వరకే చెప్పేశారు. ఇప్పుడు సమంత మరో విషయాన్ని బయటపెట్టింది. ఈ సినిమాలో విశ్రాంతి సన్నివేశంలోనూ మహేష్ అంతే ఇదిగా ఏడిపించేశాడట. ఆ సన్నివేశం మనసుని హత్తుకోవడం ఖాయమని, ఈ సినిమాకి అదే పెద్ద హైలెట్ అని.. సమంత హింట్ ఇచ్చేసింది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనూ విశ్రాంతి సన్నివేశాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు శ్రీకాంత్ అడ్డాల. కుండీ ఎందుకు తన్నావ్?? అంటూ.. మహేష్ – వెంకీల మధ్య ఓ హృద్యమైన సన్నివేశాన్ని తెరకెక్కించి… ఫ్లాట్ చేశాడు దర్శకుడు. ఈసారీ.. అలాంటి స్కీమే వేశాడట. ఆ సన్నివేశం సూపర్బ్‌గా వచ్చిందని, ఈ సినిమాకి అది మేజర్ హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. దాంతో బ్రహ్మోత్సవంపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.