‘టీఎఫ్ఐ బానిసలం సార్..’ అంటూ తెలుగు సినిమా అభిమానులు గొప్పగా, గర్వంగా చెప్పుకొంటుంటారు. నిజమే – ఇలాంటి ప్రేక్షకులు దొరకడం తెలుగు సినిమాకు వరం. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే బేధం లేదు. స్టార్ నటించాడా, కొత్తవాడు ఉన్నాడా అనే తేడా లేదు. డబ్బింగ్ సినిమా అయినా సరే, నచ్చితే డబ్బులు వెదజల్లుతాం. రీ రిలీజ్‌లను కూడా సూపర్ హిట్లు చేస్తుంటాం. ఇంతకంటే.. గొప్ప ప్రేక్షకులు ఎవరికి దొరుకుతారు?
ఇప్పుడు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకూ ఇలానే పట్టం కడుతున్నారు. పుష్కరం క్రితం విడుదలైన సినిమా ఇది. అప్పట్లో జనాలు బాగానే చూశారు. కానీ గొప్ప కమర్షియల్ హిట్ అయితే కాదు. రావాల్సినంత మైలేజీ రాలేదన్నది నిజం. అయితే ఇప్పుడు థియేటర్లో రీ రిలీజ్ చేశారు. టీవీలో వందల సార్లు ప్రదర్శితమైన సినిమా ఇది. హెచ్ డీ క్వాలిటీ అందుబాటులో వుంది. ఆ సీన్లు, డైలాగులూ చర్విత చరణాలే. కానీ రీ రిలీజ్ ఊపు మామూలుగా లేదు. ఫ్రెష్షుగా విడుదలైతే ఎంత హంగామా ఉంటుందో, అంతకంటే ఎక్కువే వుంది. వసూళ్ల గురించి ఇప్పుడే చెప్పలేం కానీ, మహేష్ ఫ్యాన్స్ తో థియేటర్లు కళకళలాడుతున్నాయి. మహేష్‌ని వెండి తెరపై చూసుకొని యేడాది దాటేసింది. పైగా ఓ పూర్తి స్థాయి ఫ్యామిలీ డ్రామా చూసి కూడా చాలాకాలం అయ్యింది. అందుకే ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఈరోజు హైదరాబాద్ లో షోలన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. కొన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే తాకిడి.
‘సీతమ్మ వాకిట్లో…’ క్లాస్ సినిమా. కానీ థియేటర్లలో మాత్రం మాస్ జాతర కనిపిస్తోంది. ప్రతీ సీన్‌కీ, ప్రతీ డైలాగ్‌కీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకొంటున్నారు. పాటలకైతే సీట్లలో ఒక్కరు లేరు. ముఖ్యంగా సీన్స్ రీ క్రియేట్ చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడే సీన్, పూల కుండీల సీన్… ఇలా చెప్పుకొంటూ పోతే, ఐకానిక్ సీన్లన్నీ రీ క్రియేట్ చేస్తున్నారు. స్టెప్పుల్ని దించేస్తున్నారు. ఏదో సినిమా చూడ్డానికివ వెళ్లినట్టు కాకుండా, ఓ సెలబ్రేషన్‌కి వెళ్లినట్టు వుంది. చాలాకాలంగా మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు థియేటర్లలో సరైన సినిమా లేదు. కాబట్టి దిల్ రాజు కూడా మంచి తరుణం చూసుకొనే సినిమాని దింపారు.