ఒక హిట్టు సినిమాకి సీక్వెల్ డిమాండ్ ఎప్పుడూ వుంటుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాకి కూడా సీక్వెల్ విన్నపాలు తరుచూ వినిపిస్తుంటాయి. ఈ సినిమాని మార్చి 7న రీరిలీజ్ చేస్తున్నారు. అప్పుడే పది థియేటర్లు ఫుల్ అయ్యాయనే ఆనందంతో ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టారు దిల్ రాజు. ఇదే సందర్భంలో సినిమాకి సీక్వెల్ ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైయింది. మంచి ఐడియా ఎవరు చెప్పినా తాను రెడీ అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు దిల్ రాజు.
ఈ ఓపెన్ ఆఫర్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాకి సీక్వెల్ అనేది ఇప్పుడున్న ట్రెండ్, మార్కెట్ ప్రకారం అవ్వనిపననే చెప్పాలి. పచ్చని గోదారి, ఓ మండవ ఇల్లు, అమ్మనాన్న..ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథ ఇది. ఈ సెటప్ లో ఇప్పుడు కథ ఊహించడమే కష్టం. దీనికి తోడూ శ్రీకాంత్ అడ్డాల ఫామ్ లో లేరు.
పైగా అప్పటి మహేష్ బాబు ఇమేజ్ కి ఇప్పటికీ చాలా తేడా వుంది. అందులోనూ ఆయన రాజమౌళి సినిమాలోకి వెళ్లిపోయారు. బేసిగ్గా ఆయన సినిమా నుంచి బయటపడిన తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో హీరోలకే ఐడియా వుండదు. వాళ్ళ చూపు పాన్ వరల్డ్, లార్జర్ దెన్ లైఫ్ కథలపైనే వుంటుంది. ఇలాంటి పరిస్థితిలో సీతమ్మ లాంటి కథకి కొనసాగింపు కష్టమే.