వీరేంద్ర సెహ్వాగ్‌కి దూకుడెక్కువ. అలాగే ఆవేశం కూడా ఎక్కువే. మన తెలుగు సినిమా హీరోయిజంతో పోల్చి చెప్పాలంటే మనవాడు కాస్త మాస్ హీరో అన్నమాట. ఈ మాస్ హీరోయిజంలో ఆవేశం చాలా ఎక్కువ ఉంటుంది. ఆలోచన మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ది బెస్ట్ బ్యాట్స్‌మెన్‌కి ఉండాల్సినంత టాలెంట్ ఉన్నప్పటికీ… కాస్త తక్కువ కాలంలోనే సెహ్వాగ్ కెరీర్ ముగిసిపోవడానికి కూడా ఆయన తీరే కొంతవరకూ కారణం అయింది. ఇప్పుడు టాప్ ఫాంలో ఉన్న కోహ్లి సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తూ ఉన్నాడు. కానీ ఫిట్నెస్, ప్రాక్టీస్‌కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఎక్కడా రిలాక్స్ అవడం లేదు. సెహ్వాగ్‌కి ఈ విషయంలోనే సరైన ప్రణాలిక, ఆలోచన లేకుండా పోయింది. అందుకే టాలెంట్‌కి తగ్గ స్థాయిలో కెరీర్‌ని నిలబెట్టుకోలేకపోయాడు.
ఆ విషయం పక్కన పెడితే ఇఫ్పుడు కామెంటేటర్‌గా కొత్త కెరీర్ స్టార్ట్ చేశాడు సెహ్వాగ్. ఇక్కడ కూడా సేం టు సేం ప్రదర్శనే చేస్తున్నాడు. తన దూకుడుతో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఒలింపిక్స్‌లో ఇండియన్స్ సాధించిన పతకాలు, విజేతల సంబరాలపైన ఇంగ్లాండ్ పాత్రికేయుడు పియర్స్ మోర్గాన్ చేసిన కామెంట్స్‌కి కౌంటర్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో కూడా తన హల్చల్ స్టార్ట్ చేశాడు సెహ్వాగ్. మోర్గాన్ ఒక్కడే ఇండియన్స్‌ని కామెంట్ చేస్తే సెహ్వాగ్ మాత్రం ఇంగ్లాండ్‌ని అవమానించేలా కామెంట్స్ చేశాడు. భారతీయులందరూ పియర్స్ మోర్గాన్‌ని ఎలా తిట్టుకున్నారో….ఇంగ్లాండ్ పౌరులు కూడా సెహ్వాగ్‌ని అదే రేంజ్లో తిట్టుకుని ఉంటారనడంలో సందేహం లేదు. పనిలో పనిగా భారతీయులపైన కూడా వ్యతిరేకత పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు మరోసారి ఆ ఎపిసోడ్‌ని తెరపైకి తీసుకుని వచ్చాడు సెహ్వాగ్. కబడ్డీలో మనవాళ్ళు ప్రపంచ కప్ గెలవడాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లాండ్‌ని అవమానించేలా కామెంట్స్ చేశాడు సెహ్వాగ్. ఇలాంటి చర్యల వళ్ళ కొంత మంది ఆవేశపరులు వీరేంద్రుడి వీరత్వాన్ని ప్రశంసించవచ్చేమో కానీ ఈ గేంని ఇంతటితో ముగిస్తే సెహ్వాగ్‌కి చాలా మంచిది. మోర్గాన్ స్థాయికి వీరేంద్ర సెహ్వాగ్ దిగజారడంతో పాటు, కొంతమంది ఆవేశపరులైన ఇరుదేశాల పౌరుల మధ్య ఇలాంటి పరస్పర విమర్శలకు అవకాశం ఇచ్చేలా సెహ్వాగ్ లాంటి సెలబ్రిటీలు వ్యాఖ్యలు చేయడం ఎవ్వరికీ మంచిది కాదు. ఇండియాలో ఉన్నవాళ్ళకు సెహ్వాగ్ మాటల ప్రభావం తెలియకపోవచ్చేమో కానీ ఇంగ్లాండ్‌లో ఉన్న భారతీయులలో కొంతమందికైనా ఆ మాటల హీట్ తాలూకు ఎఫెక్ట్ తగలడం ఖాయం. అందుకే ఆవేశానికి కాస్త అడ్డుకట్ట వేసి, కొంచెం సంయమనం పాటిస్తూ ఈ గేంని ఇంతటితో ఆపేస్తే చాలా బాగుంటుంది సెహ్వాగ్ భాయ్.