బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు దర్యాప్తు సంస్థలతో చేస్తున్న యుద్ధంలో కాల్పుల విరమణ అవగాహన కుదిరిందా ? హఠాత్తుగా ఎందుకు వేడి తగ్గిపోయింది ?. బీఎల్ సంతోష్‌ను ఎలాగైనా రప్పించాలనుకున్న సిట్ ఇప్పుడు.. హైకోర్టు స్టే ఇవ్వడంతో సైలెంట్ అయిపోయింది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ చార్జిషీట్లలో టీఆర్ఎస్కు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల ఏమీ కనిపించలేదు. దీంతో ఈ యుద్ధం కాస్త తేలిక పడినట్లేనన్న వాదన ప్రారంభమైంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు నుంచి … మా జోలికి రావొద్దని..మేము మీ జోలికి రామని చెబుతూనే ఉన్నారు. బహిరంగసభల్లోనూ చెబుతున్నారు. అయితే బీజేపీ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. టీఆర్ఎస్పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించింది. దీంతో కేసీఆర్ రివర్స్ ఆపరేషన్ ప్రారభించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతూ ముగ్గురు దొరికిపోవడంతో కేసీఆర్‌కు పెద్ద అస్త్రం దొరికిపోయినట్లయింది. బీజేపీ ఆత్మరక్షణ ధోరణిలో పడక తప్పలేదు. చివరికి విషయం కాస్త ముందుకెళ్లాక.. దర్యాప్తు సంస్థలతో ఇలా ప్రతీకార రాజకీయాలు చేసుకుంటే ఇద్దరికీ నష్టమని ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
పట్టుబడిన ముగ్గురిలో రామచంద్ర భారతి అత్యంత కీలకమని.. ఆయన వద్ద నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. బీజేపీ పెద్దల గుట్టు అంతా తెలిసిందని సిట్ అనధికారిక లీక్‌లు ఇచ్చింది. అమిత్ షా కార్యదర్శి ఆడియోలు ఉన్నాయని.. అమిత్ షాకూ నోటీసులిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు.. చల్లబడినట్లుగా కనిపిస్తోంది. రెండు వైపుల నుంచి కవ్వింపు చర్యలు లేకపోతే.. ప్రస్తుతానికి ఈ కేసుల విచారణ… ప్రముఖుల వైపు వెళ్లకుండా… ఉండే అవకాశం ఉంది. మళ్లీ ఎవరైనా గేరు మార్చితే .. మళ్లీ యుద్దం ప్రారంభమయిందని.. అనుకోవచ్చు.