ఎప్పుడో ఓసారి దర్శకుడు తేజ చేసాడు ఇదే ప్రయత్నం హీరో హీరోయిన్లు ఎవరో తెలియకుండా దాచేసి, సినిమాలోనే చూడమనడం. అలాగే గుణశేఖర్ కూడా చేసాడు వరుడు సినిమా విడుదలయ్యే వరకు హీరోయిన్ ను దాచేసి. ఇప్పుడు అదే పని దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా చేస్తున్నాడు.
ఏషియన్ సునీల్ నిర్మాతగా శేఖర్ కమ్ముల ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డ్యాన్స్ నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ కొత్తవారే. వీళ్ల ఫొటోలు, వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు శేఖర్ కమ్ముల. సెట్ లోకి ఎవర్నీసెల్ ఫోన్ లతో రానివ్వడం లేదు. అలాగే ఇప్పుడప్పుడే వీళ్ల ఫొటోలు తను కూడా రివీల్ చేయడట. సినిమా విడుదలకు వారం రోజులు ముందగా ఫంక్షన్ ఏర్పాటు చేసి, వాళ్లను పరిచయం చేస్తాడట.
ఈనెలలో రాబోయే హోలీ సందర్భంగా సినిమా టీజర్ ఇస్తారట. కానీ అందులో కూడా హీరో హీరోయిన్లను వెనుక నుంచి చూపిస్తారట కానీ, ముందు నుంచి కాదట. అయినా ఎవరయినా సినిమా కథ దాస్తారు. కీలక సంగతులు దాచేస్తారు. ఇలా హీరో హీరోయిన్లను దాచేయడం ఏమిటో?