శేఖర్ కమ్ముల సినిమాలు ఎలా ఉంటాయి? సాయింత్రపు గాలిలా చల్లదనాన్ని పంచుతాయి. వర్షాకాలంలో కాఫీలా.. వెచ్చదనాన్ని అందిస్తాయి. శీతాకాలపు మంచు తుంపరలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రేమలూ, స్నేహాలూ, బంధాలూ… వీటి చుట్టూనే ఆయన కథలు సాగుతుంటాయి. కానీ… ఈసారి శేఖర్ కమ్ముల సినిమా అలా ఉండడం లేదు. తొలిసారి శేఖర్ కమ్ముల కమర్షియల్ కోణంలో ఆలోచించడం మొదలెట్టారు. నాగార్జున, ధనుష్‌లతో ఆయన ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఓ కొత్త శేఖర్ కమ్ముల కనిపించబోతున్నారని టాక్.
మాఫియా నేపథ్యంలో సాగే కథతో శేఖర్ కమ్ముల ఈ సినిమాని తీస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో డాన్‌గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో ‘మనీ హీస్ట్’ అనే ఓ వెబ్ సిరీస్ ఉంది. ఈ కథ కూడా అలాంటి సెటప్ లోనే ఉండబోతోందని సమాచారం. చీకటి వ్యాపారం, బ్లాక్ మనీ, దోపిడీ… ఇలా పూర్తి యాక్షన్ పంథాలో సాగబోతోందట. శేఖర్ కమ్ముల నుంచి ఇలాంటి సినిమా రావడం నిజంగా షాకింగ్ విషయమే. కాకపోతే.. హింస, రక్తపాతం ఇలాంటివి శేఖర్ కమ్ములకు నచ్చవు. అవి లేకుండా ఇలాంటి సినిమాలు తీయడం సాధ్యం కాదు. మరి.. వాటిని శేఖర్ కమ్ముల ఎలా బ్యాలెన్స్ చేస్తాడో చూడాలి.