ఈవారం విడుదల కాబోతున్న సినిమాల్లో ‘నీది నాదీ ఒకే కథ’ కూడా ఉంది. ఎం.ఎల్.ఏ తరవాత…. ఈ సినిమాపైనే జనాలు ఫోకస్ చేయడం ఖాయం. ట్రైలర్లు, కాన్సెప్ట్ ఆకట్టుకొనే రీతిలోనే ఉన్నాయి. అందులో శ్రీ విష్ణు నటన కూడా.. కొత్తగా కనిపిస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాని కొంతమంది ప్రముఖులకు చూపించారు. అందులో శేఖర్ కమ్ముల కూడా ఉన్నారు. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చేసింది. ”మార్కుల పేరుతో పిల్లల్ని నాలుగ్గోడల మధ్య బంధించేశాం. ఎంసెట్, ఐఐటీ అంటూ వాళ్లని పరుగు పందెంలో నిలబెడుతున్నాం. ఈ కాంపిటేషన్లో గెలిచేది కొందరే. మిగిలినవాళ్లని పరాజితులు అనే బోర్డు మెడలో వేసి వదులుతున్నాం. తల్లిదండ్రులందరికీ ఈ సినిమా ఓ పాఠం. తొలి సినిమాతోనే ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకుని వేణు చాలా ధైర్యం చేశాడు” అంటూ కితాబిచ్చాడు శేఖర్ కమ్ముల. ట్రైలర్లో ఆ సెన్సిబులిటీస్ అర్థమవుతూనే ఉన్నాయి. ఈ నాటి కార్పొరేట్ విద్యావిధానం, తల్లిదండ్రుల ఆలోచనలు, పోటీ వాతావరణం.. వీటన్నింటిపైనా నీదీ నాదీ ఒకే కథ.. తప్పకుండా పెను మార్పు చూపిస్తుందనిపిస్తోంది. శేఖర్ కమ్ముల చెప్పినట్టే… తల్లిదండ్రుల్లో కొంతమందైనా ఈసినిమా చూసి మారితే… ఈ ప్రయత్నం సఫలమైనట్టే.