శేఖర్ కమ్ముల అనగానే ఓ రకమైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే కళ్లముందు మెదులుతాయి. తనపై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్ కి కేరాఫ్ అడ్రస్స్ ఆయన. లవ్ స్టోరీ కూడా అలాంటి సినిమానే. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల తన శైలి మారుద్దామనుకుంటున్నాడట. తనపై పడిన ఫీల్ గుడ్ ముద్రని చెరిపేసి కొత్త తరహా సినిమా చేయాలని భావిస్తున్నాడట. త్వరలో ధనుష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు శేఖర్ కమ్ముల. అది థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. ఈ విషయాన్ని శేఖర్ కమ్ములనే చెప్పాడు. సో… శేఖర్ ఆ ప్రయత్నాలు ప్రారంభించేశాడన్నమాట.
నిజానికి శేఖర్ కమ్ముల `అనామిక`తోనే ఆ ప్రయత్నం చేశాడు. ఈ సినిమా శేఖర్ కమ్ముల శైలిలో ఉండదు. ఓ థ్రిల్లర్. ఎప్పుడూ రీమేకులు చేయని శేఖర్ కమ్ముల థ్రిల్లర్ చేయడంలో ఉద్దేశ్యం అదే. అయితే అది వర్కవుట్ కాలేదు. కుటుంబ కథలు, ప్రేమకథలూ చెప్పే శేఖర్ కమ్ముల `లీడర్`తో పొలిటికల్ డ్రామా టచ్ చేశాడు. ఇది కూడా మార్పులో భాగమే. కానీ.. ఎవ్వరూ గుర్తించలేదు. ఇప్పుడు ధనుష్ సినిమాతో అయినా తన తాపత్రయం, ప్రయత్నం అర్థమవుతాయేమో చూడాలి.