ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. తెలుగమ్మాయిలకు అవకాశాలు ఇస్తామంటూ కొందరు దర్శక నిర్మాతలు వాడుకుని వదిలేస్తున్నారంటూ వార్తల్లోకి ఎక్కిన శ్రీరెడ్డి, ఏప్రిల్ 1న శేఖర్ కమ్ములపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. “తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికి రారు అని అతడి ప్రగాఢ విశ్వాసం. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం” అని నీచంగా మాట్లాడారామె.
(శ్రీరెడ్డి ఆరోపణలపై వార్త చదవండి)
శ్రీరెడ్డి ఆరోపణలపై శేఖర్ కమ్ముల మండిపడ్డారు. ఆమె చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకోకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఫేస్బుక్లో ఈ వివాదంపై శేఖర్ కమ్ముల ఒక పోస్ట్ చేశారు.
“నన్ను కించపరుస్తూ, సోషల్ మీడియాలో నిన్న వచ్చిన పోస్ట్, నా దృష్టికి వచ్చింది. ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. ఆ పోస్ట్ నాకు, నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించింది. నేను ఎప్పుడూ కలవని, అసలు చూడనే చూడని, కనీసం ఫోన్లో కుడా మాట్లాడని అమ్మాయి , నా గురించి ఆధారం లేని ఆరోపణలు చేయటం షాకింగ్ గా ఉంది. ఈ దిగజారుడు చర్య వెనక ఎవరున్నా, వారి ఉద్దేశం ఏమైనా, నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఇది తప్పు, నేరం, అనైతికం.
స్త్రీ ల సమానత్వం, సాధికారతలని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదు.
ఆ పోస్ట్ లోని ప్రతీ మాట తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటాను”
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలు, ప్రముఖులపై అప్పుడప్పుడూ వార్తలు వస్తుంటాయి. ఇటువంటి ఆరోపణలు, పుకార్లు రావడం సహజమే. అయితే… శేఖర్ కమ్ముల వంటి దర్శకుడికి ఇటువంటి విషయాల్లో క్లీన్ చీట్ వుంది. ఇండస్ట్రీకి దూరంగా వుండే ఆయనపై అందరికి మంచి అభిప్రాయం వుంది. అటువంటి వ్యకిపై శ్రీరెడ్డి ఆరోపణలు చేయడంతో చాలామంది షాక్ అయ్యారు. శేఖర్ కమ్ముల వార్నింగ్ ఇచ్చేంత వరకూ వ్యవహారం వచ్చింది. ఇప్పుడు శ్రీరెడ్డి ఏమంటుందో?