సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాలు తీసే తీరు పాసింజర్ రైలుని తలపిస్తుంటాయి. ఆగి… ఆగి.. కొంచెం.. కొంచెం.. తన మూడ్ ని బట్టి, షూటింగ్ చేస్తుంటాడు శేఖర్ కమ్ముల. దానికి తగ్గట్టుగా లాక్ డౌన్, కరోనా గోల.. వీటి మధ్య `లవ్ స్టోరీ`కి చాలా బ్రేకులు పడ్డాయి. వేసవి బరిలో దిగాల్సిన సినిమా ఇది. శేఖర్ కమ్ముల ఫాస్టుగా ఉంటే అంతకంటే ముందే విడుదల కావల్సింది. కానీ అది జరగలేదు. ఈ సినిమాకి సంబంధించి మరో 15 రోజులు షూటింగ్ చేయాల్సివుంది. దాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నది శేఖర్ ప్లాను. ఈ సినిమా పూర్తయినా ఈ యేడాది విడుదల చేయకూడదని చిత్రబృందం భావిస్తోంది. 2020 లోపు థియేటర్లు ఓపెన్ అయి, సంక్రాంతి సీజన్‌కి టాలీవుడ్ సిద్ధమైతే, అందులో భాగంగా `లవ్ స్టోరీ`ని బరిలోకి దింపాలని శేఖర్ భావిస్తున్నాట. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలిచే పరిస్థితి లేదు. ఒకట్రెండు సినిమాలున్నా – శేఖర్ కమ్ముల సినిమాల్ని ప్రత్యేకించి అభిమానించే ఓ వర్గం ఎలాగూ ఉంటుంది. కాబట్టి – పోటీ ఉన్నా నెట్టుకు రావొచ్చు. పెద్ద సినిమాల్నీ దూరమైతే, ఇంకా మంచి ఓపెనింగ్స్ దొరుకుతాయి. ఇదీ.. శేఖర్ టార్గెట్.
అయితే.. 15 రోజుల షూటింగ్లో రెండు పాటల్ని పూర్తి చేయాల్సివుంది. అందులో ఒకటి రోడ్డుపై తీయాల్సిన పాట ఉందట. జన సమూహం మధ్యలో ఆ పాట తీయాలని శేఖర్ భావిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో అలాంటి పాట తీయడం కష్టమే. అందుకే.. ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని అన్వేషిస్తున్నాడు శేఖర్ కమ్ముల.