నోట్ల రద్దు సమయంలో కోట్ల కొద్దీ పెద్ద నోట్లతో పట్టుబడిన శేఖర్ రెడ్డికి తర్వాత సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ ధైర్యమో ఏమో కానీ ఇప్పుడు నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోని మీడియా సంస్థలకు.. అదే మీడియా సంస్థల్లో ప్రకటనలు ఇచ్చి మరీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కాంట్రాక్ట్ విషయంలో వివిధ మీడియాల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ.. సుప్రీంకోర్టు లాయర్‌తో చట్ట బద్దమైన హెచ్చరికలు జారీ చేయించారు. ఆ ప్రకటన ప్రకారం.. ఇప్పటి వరకూ.. ఏపీలో ఎలాంటి మైనింగ్ వ్యవహారాల్లోనూ శేఖర్ రెడ్డి పాల్గొనలేదు. అలాగే.. టెండర్లలోనూ పాల్గొనలేదు. అలా అని పాల్గొనబోడని కాదు. తనకు అన్ని ఏపీలో మైనింగ్ చేయడానికి అన్ని చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని ఆయన చెప్పుకొస్తున్నారు.
శేఖర్ రెడ్డి ఇంత కంగారు పడి ముందస్తుగా… మీడియాకు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీ సర్కార్ ఇటీవల ఇసుక విధానం మార్చింది. ఇసుక మొత్తం ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇంకెవరికిస్తారు.. శేఖర్ రెడ్డికే ఇచ్చి జే ట్యాక్స్ వసూలు చేస్తారని.. విపక్ష నేతలు ఆరోపణలు ప్రారంభించారు. ఇసుక కాంట్రాక్టులు ఇవ్వాలనుకుంటే చాలా మంది ఉన్నారు. అసలు శేఖర్ రెడ్డి పేరే ఎందుకు బయటకు వచ్చిందో చాలా మందికి తెలియదు. ఆయనకు ఇవ్వడానికే ఇసుక విధానం మార్చేశారని.. వైసీపీలోని వర్గాలే ప్రచారం చేస్తూండటంతో ఈ విషయం మెల్లగా మీడియాలో హైలెట్ అవుతోంది.
శేఖర్ రెడ్డి తాను ఇసుక కాంట్రాక్టుల్లో పాల్గొనబోనని.. ఆ ప్రకటన ద్వారా చెప్పడంలేదు. పాల్గొంటానని చెబుతున్నారు. తనకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని నోటీసులు ఇస్తున్నారు. అంటే… ఇప్పుడు మీడియాలో ప్రచారం అవుతున్న దాని ప్రకారం చూస్తే.. ఆయన ఇసుక టెండర్లలో పాల్గొనబోతున్నారు. ఆ సమయంలో మీడియా వార్తలను కంట్రోల్ చేయడానికే ఇలా ముందస్తుగా హెచ్చరిక ప్రకటనలు చేసినట్లుగా భావిస్తున్నారు. అసలు శేఖర్ రెడ్డి అనే వ్యక్తి టీడీపీ హయాంలోనే టీటీడీ మెంబర్. అప్పట్లో నోట్ల కట్టలతో దొరికినప్పుడు.. లోకేష్ బినామీ అని.. చంద్రబాబు బినామీ అని వైసీపీ నేతలు.. జగన్.. సాక్షి మీడియాకు కూడా ఆరోపించారు. కానీ అప్పుడే..టీటీడీ బోర్డు మెంబర్ పదవి నుంచి చంద్రబాబు తొలగించారు. చంద్రబాబు బినామీ అని ఆరోపించిన జగనే.., తాను సీఎం అవగానే శేఖర్ రెడ్డికి.. టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వడమే కాదు.. ఇప్పుడు ఆయనకే ఏపీలో ఇసుక కట్టుబెట్టడానికి . .. ఇసుక విధానమే మార్చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.