ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయం సందర్భం చూడకుండా ఒకే రికార్డు వేయడం దుర్భరంగా మారిపోతున్నది. రాష్ట్ర విభజన తనను ఎన్నుకోవడం, హైదరాబాదు అభివృద్ధి, అమరావతి ప్రపంచ నగరం, రైతుల నమ్మకం, దేశ దేశాలు తిరగడం ఇదే కథ చెబుతుంటే ప్రజల సంగతి ఎలా వున్నా వేదికపై ప్రముఖులే తట్టుకోవడం కష్టంగా వుంది. గుంటూరు జిల్లా గోళ్లపాడులో ఈ రోజు ఆయన హాస్టళ్లు ,ఆర్డీవో ఆఫీసు సముదాయానికి శంకుస్థాపన చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో హాస్టళ్ల మూత పెద్ద సమస్యగా వుంది. దాని గురించి మాట్లాడేబదులు షరా మామూలుగా హైదరాబాదు కోసం తను చేసిన అభివృద్ధి పాట ఎత్తుకున్నారు. హైటెక్ సిటీ,రింగురోడ్డు,ఎయిర్పోర్టు ప్రతిదానిమీదా తన ముద్ర వుందన్నారు. దానివల్లనే ఇప్పుడు తెలంగాణకు అధిక ఆదాయం, ఎపికి తక్కువ ఆదాయం వచ్చిందన్నారు. ఈ పరిస్థితిలో చంద్రబాబు నాయుడు అయితేనే న్యాయం చేయగలరని ప్రజలు తనను ఎన్నుకున్నారని ఆయనే చెప్పుకోవడం ఇక్కడ హైలెట్. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేవారు గాని ఇప్పుడు నేరుగా తననే చెప్పుకోవడం మొదలెట్టారన్నమాట. ఫైళ్లు కూడా తనే మోసుకుంటూ ప్రపంచమంతా తిరిగారట. అమరావతిలో రైతులు తనను నమ్మినట్టే మిగిలిన వారంతా నమ్మితే అద్బుతాలు చేస్తారట. అమరావతిని ప్రపంచ నగరాల్లో ఒకటిగా మారుస్తారట. ఒక రోజు లేదా ఒక నెల వినాలంటే సరే గాని రోజూ ఇదే రికార్డు వేస్తుంటే ఎలా బాబుగారూ? ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే ఈ క్లిప్పింగు వేసుకుని చూడండి.మీరు మాట్లాడుతుంటే వేదికపై మీ నాయకులు ఒక్కరి మొహంలోనైనా కాంతి కనిపిస్తుందా?