వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత వారం రోజుల్లోనే.. ఆంధ్రప్రదేశ్‌లో గెలుపోటముల్ని నిర్ణయించే.. ఓ ప్రధాన సామాజివర్గానికి సంబంధించిన సెంటిమెంట్‌ను దెబ్బతీసే ప్రకటనలు, నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దుర్భాషలాడటం. మరొకటి… కాపు రిజర్వేషన్లపై చేతులెత్తేయడం. రెండు వేర్వేరు అంశాలే అయినప్పటికీ.. రెండింటికి రాజకీయంగా సంబంధం ఉంది. ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి తన సహజసిద్దంగా అనాలోచితంగా వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయాలు చాలా బలంగా వినిపిస్తున్నప్పటికీ.. వైసీపీలోని కొన్ని వర్గాలు మాత్రం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతా ప్లాన్డ్‌గానే వ్యవహరిస్తున్నారని సమర్థిస్తున్నారు.
పవన్ కల్యాణ్ విషయంలో వ్యక్తిగత విమర్శలు చేయడం వెనుక ఆయన దూరదృష్టి ఉందని వైసీపీ వర్గాలు ఇప్పటికే జోరుగా ప్రచారం ప్రారంభించాయి. పవన్ కల్యాణ్‌తో వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితిని బీజేపీ ఇప్పటికే కల్పిస్తోంది. పవన్‌తో కలిస్తే తప్ప… చంద్రబాబును ఓడించడం కష్టం అన్న భావన.. బీజేపీ పెద్దల్లో ఉంది. ఏపీలో బీజేపీ ఏకైక ఎజెండా చంద్రబాబును ఓడించడం. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం… పవన్ కల్యాణ్ పార్టీ ఏ మాత్రం పుంజుకున్నా.. అది తనకే చేటు చేస్తుందని నమ్ముతున్నారు. అలాంటి పార్టీకి తాను సీట్లు ఇచ్చి.. పెంచి పోషిస్తే..అంతిమంగా తనకే నష్టం చేకూరుస్తుందని నమ్మారు. పైగా కల్యాణ్‌కు ఇచ్చే పది, ఇరవై సీట్లు అయినా.. టీడీపీ ఖాతాలోకే వెళ్తాయని అనుమానిస్తున్నారు. అదే సమయంలో వపన్ కల్యాణ్‌తో పొత్తుపై సొంత పార్టీలో ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో బీజేపీ నుంచి కూడా.. ప్రతిపాదనలు ప్రారంభమయ్యాయి. వీటిని ఎక్కడికక్కడ కట్ చేయాడానికే పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసినట్లు చెబుతున్నారు.
ఇక కాపు రిజర్వేషన్ల అంశం తన వల్ల కాదని ప్రకటించడానికి… తనపై విశ్వసనీయత పెంచుకోవడమే లక్ష్యమని చెబుతున్నారు. ఇప్పటికే తాను పాదయాత్రలో ఇస్తున్న హామీలు అమలు చేయడానికి కేంద్ర బడ్జెట్ సరిపోదనే విమర్శలు వస్తున్నాయి. చేయగలనని నమ్మించడానికి కొన్ని చేయలేనని చెబితే.. మిగతావి చేస్తారని ప్రజలు నమ్ముతారని జగన్ ఆలోచించారంటున్నారు. నిజానికి కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని.. ప్రకటించడం ద్వారా.. వాటిని వ్యతిరేకిస్తున్న బీసీ వర్గాలను ఆకర్షించవచ్చనేది జగన్ ప్లాన్ అని…వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
జగన్ సన్నిహిత వర్గాలు చేస్తున్న ఈ ప్రచారంలో కొంత లాజిక్ కనిపిస్తున్నప్పటికీ… పవన్ తో పొత్తు పెట్టుకోకుండా ఉండటానికి… తనపై విశ్వసనీయత పెంచుకోవడానికి ఓ ప్రధాన సామాజికవర్గం మొత్తాన్ని ఏకపక్షంగా వదిలేసుకోవడానికి సిద్దపడతారా అన్న సందేహాలు కూడా అదే పార్టీ నేతల్లో వస్తున్నాయి. కానీ… జగన్ చేసుకున్నది సెల్ఫ్ గోల్స్ కాదు…కచ్చితంగా వ్యూహాత్మకమే అని చెప్పుకోవడానికి జగన్ సన్నిహిత వర్గాలు తమ వాదన మాత్రం బలంగా వినిపిస్తున్నారు.