అధికారమే బ్రహ్మాస్త్రంగా తెరాస తిరుగులేని విజయాలతో జైత్రయాత్ర సాగిస్తోంది. బీజేపీ మాత్రం కేడర్లో ఉత్తేజాన్ని నింపడానికి బదులు నిస్తేజంగా మారింది. వరసగా పరాజయాలను మూటగట్టుకుంటోంది. తెలంగాణ బీజేపీ దయనీయ పరిస్థితి చూస్తే, బహుశా ప్రత్యర్థి పార్టీలకు కూడా జాలి కలుగుతుందేమో. పూర్తి మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఎలా ఉండాలి? అందులోనూ మోడీ వంటి దూకుడుతనం గల వ్యక్తి ప్రధాని అయినప్పుడు ఎంత జోష్ తో ముందుకు పోవాలి? అదేంటో, మోడీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో కూడా తెలంగాణ కమలనాథుల్లో అంతగా హుషారు కనిపించలేదు. ఆనాటి ఉత్సాహభరిత వాతావరణంలో కేడర్ ను విస్తరించుకోలేదు. పార్టీని బలోపేతం చేసుకోలేదు. అధ్యక్షుడు అమిత్ షా అనేక సార్లు పలు సూచనలు చేశారని వార్తలు వచ్చాయి. అయినా తెలంగాణ బీజేపీ నాయకత్వం ఫుల్ జోష్ తో ముందుకు వెళ్లిన సందర్భాలేమీ లేవు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది వరకూ బీజేపీ అంటే క్రేజ్ ఉండేది. మోడీ మ్యాజిక్ చర్చనీయాంశంగా ఉండేది. అయినా తెలంగాణలో మాత్రం షరామమూలే. పార్టీ ఉనికి నామమాత్రమైన జమ్ము కాశ్మీర్లో కూడా బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేశాయి. ఫలితంగా బీజేపీ 25 సీట్లు సాధించడం ఆ పార్టీకే ఆశ్చర్యం కలిగించింది. కిషన్ రెడ్డి నాయత్వంలో పార్టీ ఎంతో బలపడుతుందని అధినాయత్వం భావించింది. కానీ దాని అంచనాలు తప్పాయి. వరంగల్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక విషయంలో చేసిన తప్పిదానికి భారీ మూల్యం చెల్లించుకుంది. డిపాజిట్ కూడా దక్కని దౌర్భాగ్య స్థితి ఎదురైంది. అసలా అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వారికే తెలియని పరిస్థితి. మరోవైపు, చాలా కాలంగా ఉద్యమంలో పాల్గొన్న దయాకర్ ను తెరాస పోటీకి నిలిపింది. బీజేపీ వారు మాత్రం ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుని టికెట్ ఇచ్చి బోల్తా పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ పరాభవం మరీ దయనీయం. కేంద్రంలో అధికారంలో లేకపోయినా నగరంలో మాత్రం కమలం తన ఉనికి చాటుకుంటూ వస్తోంది. సిటీలో ఓ ప్రధాన పార్టీగానే చెలామణి అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా హైదరాబాదులో దూకుడుగా ప్రచారం చేయలేకపోయింది. కేంద్రం మంజూరు చేసిన సంస్థల గురించి తెలంగాణ నేతలు గట్టిగా చెప్పుకోలేకపోయారు. కేసీఆర్ ట్రంప్ కార్డ్ అయిన డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలోనూ బీజేపీ వైఫ్యలం స్పష్టంగా కనిపించింది. తెలంగాణకు కేంద్రం 42 వేల ఇళ్లు మంజూరు చేసిందని, ప్రతి ఇంటికి లక్షా 50 వేల నిధులను ఇస్తోందని బీజేపీ వారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పలేక పోయారు. అనేక సందర్భాల్లో కేసీఆర్ ను ఇరుకున పెట్టే అవకాశం వచ్చినా బీజేపీ నేతలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. హైదరాబాదును స్మార్ట్ సిటీస్ లిస్టులోంచి తొలగించాలన్న కేసీఆర్ లేఖను సరిగా హైలైట్ చేయలేకపోయారు. కరీంనగర్ కు అదనంగా అవకాశం కల్పించాలని అడగాలే తప్ప, హైదరాబాదుకు వచ్చిన అవకాశాన్ని కాలదన్నడంపై గట్టిగా మాట్టాడలేదు. ఇంత పెద్ద నగరానికి ఆఫ్టరాల్ వంద కోట్లు ఇస్తారా, అందుకే వద్దన్నా అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. వంద కోట్లు తక్కువా? నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తూ ప్రజల జీవితాలను ఉద్ధరిస్తున్నట్టు చెప్పుకొనే కేసీఆర్, వంద కోట్లు తక్కువన్నట్టు మాట్లాడటంపై బీజేపీ విరుచుకు పడలేదు. జేబులో కోటి రూపాయలు ఉన్నా, ఓ వంద నోటు దొరికితే కాదంటారా? పైగా స్మార్ట్ సిటీ పథకం ద్వారా వంద కోట్లే కాదు, చాలా ఎక్కువ నిధులనే కేంద్రం కేటాయిస్తుంది. ఏపీలో కాకినాడనే దాదాపు 2 వేల కోట్లతో స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయాన్ని హైదరాబాదీలకు వివరించడంలో బీజేపీ విఫలమైంది. నాగ్ పూర్ లో బీజేపీ పాలనను చూసే, ఇంటింటికీ రెండు చెత్తబుట్టలను ఇదే పద్ధతిని హైదరాబాదులో తెరా ప్రభుత్వం చేపట్టిందని బీజేపీ చెప్పలేకపోయింది. ఆ మధ్య అహ్మదాబాద్ నగరంలో అభివృద్ధిని చూసి కేటీఆర్ ఆశ్చర్యపోయారు. హైదరాబాదులోనూ అలాగే అభివృద్ధి చేస్తామన్నారు. నగరాలను బాగు చేయడంలో బీజేపీకి సాటిలేదనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడంలో ఫెయిలయ్యారు. అన్నిటికీ మించి, కేడర్ లో జోష్ నింపడంలో కిషన్ రెడ్డి, ఇత నేతలు విఫలమయ్యారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు సందర్భంగా లుకలుకలు, కొన్ని చోట్ల స్నేహపూర్వక పోటీ, మరికొన్ని చోట్ల రెండు పార్టీల వారు క్రేత్ర స్థాయిలో పూర్తిగా సహకరించుకోక పోవడం వంటివి బీజేపీని దెబ్బతీశాయి. అభ్యర్థులు సరైన వ్యూహంతా పనిచేసిన నాలుగు డివిజన్లలో మాత్రం విజయం దక్కింది. కిషన్ రెడ్డి నియోజకవర్గం అంబర్ పేటలో ఒక్క డివిజన్ ను కూడా బీజేపీ గెలవలేక పోయింది. మిగతా ఎమ్మెల్యేలలో ఒక్క రాజాసింగ్ నియోజకవర్గంలో ఒక డివిజన్ బీజేపీకి దక్కింది. మిగతా మూడు డివిజన్లూ ఇతర పార్టీల ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లోనివే. పరిస్థితి ఇలాగే కొనసాగితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో?