మునుగోడులో కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. బీజేపీ తరపున రాజగోపాల్ రెడ్డి పోటీ ఖాయం. మరి టీఆర్ఎస్ తరపున ఎవరు…? పోటీ చేసేది టీఆర్ఎస్సా..బీఆర్ఎస్సా అన్నది పక్కన పెడితే అభ్యర్థి ఎవరు అన్నది ఇప్పుడు క్యాడర్‌కు అంతు చిక్కడం లేదు. అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఫైనల్ చేశారని చాలా రోజులుగా చెబుతున్నారు. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఆయనపై పార్టీలోనే సానుకూలత లేదు. కానీ కేసీఆర్ మాత్రం ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని డిసైడ్ చేశారు.
అయితే ఇతర పార్టీలు రెడ్డి సామాజికవర్గానికి ఇచ్చాయి కాబట్టి బీసీకి ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే అధికారిక ప్రకటన ఆలస్యమవుతోంది. ఈ లోపు టీఆర్ఎస్సా.. బీఆర్ఎస్సా అనే సందేహం ఉండనే ఉంది. ఈసీ ఎప్పుడు అనుమతి ఇస్తుందనేది ఇప్పుడు కీలకం. టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా.. బీఆర్ఎస్ తరపున పోటీ చేసినా కారు గుర్తు ఉంటుంది. ఓడిపోతే ఓడింది టీఆర్ఎస్ అభ్యర్థే.. బీఆర్ఎస్ అభ్యర్థి కాదు అనిచెప్పి తప్పించుకోవడానికి లేదు.
మునుగోడులో ఓడిపోతే ఆ ప్రభావం దేశం మొత్తం బీఆర్ఎస్పై ఉంటుంది. ఆయన గ్రౌండ్లో పట్టుకోల్పోయారు కాబట్టి ఇప్పుడు దేశం అంటూ బయలుదేరారని లైట్ తీసుకుంటారు. అంతకు ముంచి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అది పార్లమెంట్ కంటే ముందే వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మేలు చేయదు. కీడు చేస్తుంది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఉపఎన్నికల్లో అందరి కంటే ముందే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటిస్తారు.ఈ సారి నామినేషన్ల గడువు వచ్చినా … ప్రకటించలేకపోయారు.