సీనియర్ నటుడు బాలయ్య (94) కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు మన్నవ బాలయ్య. ఈరోజు తెల్లవారుఝామున హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, కథకుడిగా.. విభిన్న రూపాల్లో చిత్రసీమకు సేవలు అందించారాయన. దాదాపు 300 చిత్రాల్లో నటించారు. సాత్విక పాత్రలకు ఆయన పెట్టింది పేరు. తండ్రిగా, బాబాయ్‌గా, తాతయ్యగా.. ఇలా పెద్దరికం ఒలకబోసే పాత్రల్లో కనిపించారు. `అంకురం` ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అమృత ఆర్ట్స్ సంస్థ స్థాపించి విజయవంతమైన చిత్రాలు అందించారు. చెల్లెలి కాపురం, నేరము శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, ఊరికిచ్చిన మాట.. ఇవన్నీ ఆయన సంస్థ నుంచి రూపొందించిన చిత్రాలే. దర్శకుడిగా పసుపుతాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు చిత్రాలు అందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాటతో నంది అవార్డు అందుకున్నారు. ఆయన కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించారు.