ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ ‘బాహుబలి’, తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింప చేసిన గొప్ప సినిమా ‘బాహుబలి’, తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘బాహుబలి’…ఇలా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కొన్ని రోజులపాటు తుఫానులా పట్టి కుదిపేసిన విషయం తెలిసిందే. కానీ, ‘బాహుబలి’ ఓ స్టుపిడ్ సినిమా’ అని ఒకరు విమర్శించారు. ఈమాట అన్నది ఎవరో కాదు అలనాటి టాప్ మోస్ట్ హీరోయిన్ జమున.
శనివారం రాజమండ్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జమున ఈ విధంగా వ్యాఖ్యానించింది. తన మనవడి బలవంతం మీద ‘బాహుబలి’ చిత్రాన్ని చూశానని, నిజంగా అది ఓ స్టుపిడ్ సినిమా అనీ, దీని కంటే పెద్ద పదం ఏదైనా వుంటే ఆ సినిమాకి ఉపయోగించవచ్చునని జమున ఘాటుగా చెప్పారు. టెక్నికల్ వేల్యూస్ తప్ప సినిమాలో ఏమీ లేదని, ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ తప్ప మిగతా పాత్రలన్నీ పనికి రానివనీ, ఆ పాత్రలకు తగిన ఆర్టిస్టుల్ని ఎంపిక చేసుకోవడంలో రాజమౌళి విఫలమయ్యాడని అన్నారు. తమన్నా స్థానంలో అనుష్కను ఎంపిక చేసి వుంటే బాగుండేదని జమున అభిప్రాయ పడ్డారు.