ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నమ్మకమైన మరో సీనియర్ అధికారి దూరమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలకంగా వ్యవహరించి.. సీఎం అదనపు కార్యదర్శిగా ఉన్న పీవీ రమేష్ రాజీనామా చేశారు. కొంత కాలంగా ఆయన విధులకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన రాజీనామాను ఆమోదించామని… నవంబర్ ఒకటో తేదీ నుంచే వర్తింప చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీవీ రమేష్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి కేంద్ర సర్వీసుల్లో ఉండేవారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. ఆయన ఏపీలో కీలకంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన సమర్థతను ఇతర ప్రభుత్వాలు గుర్తించాయి. కీలక పోస్టులు ఇచ్చాయి. అయితే.. ఎక్కడ ట్యూన్ అయిందో కానీ.. ఆయన మాత్రం వైఎస్ ఫ్యామిలీకి దగ్గర. జగన్ అధికారంలోకి రాగానే ఆయనకు కీలక బాధ్యతలు ఇచ్చారు.
ఏపీ సర్వీసుకు వచ్చిన తర్వాత ఆయన రిరైటరయ్యారు. అయినప్పటికీ.. సీఎం అదనపు ప్రధాన కార్యదర్శి గా కొనసాగించి.. సీఎంవోలో కీలకమైన శాఖల్ని చూసుకోమని ఇచ్చారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో… తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహించారు. మధ్యలో ఎక్కడ తేడా పడిందో కానీ.. హటాత్తుగా.. ముఖ్య సలహాదారుగా ఉన్న కల్లాం అజేయరెడ్డితో పాటు పీవీ రమేష్ శాఖలన్నింటినీ తొలగించి.. ఇతరులకు అప్పగించారు. దాంతో వీరిద్దర్నీ సాగనంపుతున్నారని అనుకున్నారు. కానీ కల్లాం అజేయరెడ్డిని మళ్లీ రెండు రోజులకే జగన్ పిలిచి.. పనులు చెప్పడం ప్రారంభించారు. ఆయనతో నే సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ లేఖ విడుదల చేయించారు.
అయితే పీవీ రమేష్‌ను మాత్రం జగన్ పిలవలేదు. మళ్లీ బాధ్యతలు తీసుకోవాలని అడగలేదు. ఇంత కాలం ఎదురు చూసిన ఆయన ఇక పిలువరని డిసైడయ్యారు. రాజీనామా సమర్పించారు. ఈ మధ్య కాలంలో జగన్‌కు వ్యతిరేకంగా పరోక్షంగా… సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు కూడా చేశారు. అవి కూడా హైలెటయ్యాయి. మొత్తానికి కారణం ఏమిటో తెలియదు కనీ.. సమర్థమైన.. నమ్మకమైన అధికారిని జగన్ కోల్పోయారని ఆయన సన్నిహిత వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.