సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఇక కోర్టు కేసుల్లో తన పేరు ఉండకుండా చూసుకోవాలని డిసైడయినట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు సూటిగానే చెప్పారన్న ప్రచారం సెక్రటేరియట్ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో జైలు పాలయి.. కోర్టుల చుట్టూ తిరుగుతూంటే.. కొత్తగా ప్రభుత్వ నిర్ణయాల వల్ల శిక్షలకు గురి కావాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సేవా శిక్షను ఆమె అనుభవించాల్సి వస్తోంది. కోర్టు నిర్ణయాలను అమలు చేయకపోవడం వల్ల పడిన శిక్ష అది.
నిజానికి కోర్టు నిర్ణయాలను అమలు చేయడం అధికారులకు పెద్ద పని కాదు.కానీ ప్రభుత్వం వద్దంటోంది. అలా వద్దనడం వల్ల అధికారులు బలవుతున్నారు. చాలా మంది తప్పించుకుంటున్నారు. కానీ కొంత మంది మాత్రం ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం సరే అంటున్నారు. అమరావతి కేసుల్లోనూ శ్రీలక్ష్మినే ప్రధానంగా బాధ్యుల్ని చేసి అఫిడవిట్లు వేస్తున్నారు. ఆమె లేనప్పుడు మాత్రమే వేరేవారికి అఫిడవిట్లు వేయాలని ఆదేశాలిచ్చారు. కానీ ఇప్పుడు తన పేరుతో అసలు అమరావతి అఫిడవిట్లు వద్దని ప్రభుత్వ పెద్దలకు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె ఖరాఖండిగా చెప్పడంతో ఇప్పుడు ఆమెకు బదులుగా వేరే వారి పేర్లతో అమరావతి అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు.
అమరావతి విషయంలోనూ రైతులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఉద్దేశపూర్వకంగా అమలు చేయడం లేదని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం కూడా… హైకోర్టుతీర్పును పాటించడం ఇష్టం లేకపోయినా పాటిస్తానన్నట్లుగా ఒక్కో అడుగు వేస్తోంది . కోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యాన్ని న్యాయస్థానాలు అసలు సహించడం లేదు. దీంతో ఆ విషయంలోనూ తనకు ఇబ్బందులు ఎదురవుతాయేమోనని శ్రీలక్ష్మి నిర్మోహమాటంగా తనకు అమరావతి అఫిడవిట్లతో సంబంధం లేదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.