ఆంధ్రప్రదేశ్‌లో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత.. హైలెట్ అయిన అంశాల్లో ఒకటి.. తెలంగాణ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఏపీకి రావడం. కొంత మంది సీనియర్ అధికారులు… గతంలో వైఎస్ హయాంలో… అత్యంత నమ్మకంగా పని చేసిన వాళ్లను.. తమ వద్దకు పంపాలని.. జగన్మోహన్ రెడ్డి కోరారని.. దానికి కేసీఆర్ అంగీకరించారన్న ప్రచారం జరిగింది. అలా ఐపీఎస్ స్టీఫెన్ రవీంద్ర, ఐఏఎస్ శ్రీలక్ష్మిలు జగన్మోహన్ రెడ్డిని కలిసి వెళ్లారు కూడా. వారికి కీలక బాధ్యతలని ప్రచారం జరిగింది. కానీ నెల రోజులైన తర్వాత వారి ఊసు ఎక్కడా వినిపించడం లేదు.
స్టీఫెన్ రవీంద్ర ఏపీకి రావడంలో ఎందుకు ఆలస్యం..!?
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలలో గెలిచిన తర్వాత… ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఆ సమయంలో జరిగిన చర్చల్లో.. ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి.. స్టీఫెన్ రవీంద్రను.. ఏపీకి పంపాల్సిందిగా కోరినట్లు ప్రచారం జరిగింది. వైఎస్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన ఆయన… జగన్ వీరాభిమాని అనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఆయనకు ఇంటలిజెన్స్ చీఫ్ పోస్ట్ ఇస్తారని భావించారు. దానికి తగ్గట్లుగానే.. జగన్ ప్రమాణస్వీకారం చేయక ముందే.. అమరావతి వచ్చి.. జగన్‌ను కలిసి వెళ్లారు. తెలంగాణ సర్కార్, కేంద్రం.. రెండూ జగన్ పట్ల సానుకూలంగా ఉన్నాయి కాబట్టి… డిప్యూటేషన్ ప్రాసెస్ పది రోజుల్లో పూర్తయిపోతుందనుకున్నారు. కానీ ఆ తర్వాత అంతా సైలెంటయిపోయారు.
ఐఏఎస్ శ్రీలక్ష్మిని కూడా జగన్ వద్దనుకున్నారా..?
స్టీఫెన్ రవీంద్రతో పాటు.. ఐఏఎస్ శ్రీలక్ష్మిని కూడా… జగన్ ఏపీకి ఆహ్వానించారు. ఆమెకు ప్రభుత్వంలో అత్యంత కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు… వైసీపీ వర్గాలు మీడియాకు తెలిపాయి. గాలి జనార్ధన్ రెడ్డి మైనింగ్ కేసులు.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కున్న ఆమె… జైలు పాలు కావాల్సి వచ్చింది. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ అయిన ఆమె.. చీఫ్ సెక్రటరీ అయి ఉండేవారని.. జగన్ కేసుల్లో ఇరుక్కోవడంతో.. కెరీర్ నాశనం అయిందని … ఆ మేరకు.. జగన్ ఆమెకు న్యాయం చేయాలనుకున్నారని చెబుతున్నారు. అందుకే.. ఏపీకి తీసుకు వచ్చి.. ఆమెకు నవరత్నాల బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. ఆమె అమరావతి వచ్చి జగన్‌తో సమావేశమయ్యారు కూడా. కానీ.. తర్వాత సైలెంటయిపోయారు. నవరత్నాలకు వేరే అధికారుల్ని జగన్ నియమించారు.
వద్దనుకున్నారా..? వాళ్లే రాబోమన్నారా..?
నిజానికి ఆ అధికారులిద్దర్నీ జగన్మోహన్ రెడ్డి .. కావాలనుకున్నారు. అందుకే తెలంగాణ సర్కార్‌ను అడిగారు. దానికి తగ్గట్లే తెలంగాణ సర్కార్ వారిద్దర్నీ.. జగన్‌తో మాట్లాడి రావాలని.. అమరావతి పంపింది. వారిద్దరూ వచ్చి మాట్లాడి వెళ్లారు. ఆ తర్వాత వ్యవహారం సైలెంటయిపోయింది. ఏపీకి వెళ్లడానికి ఆ అధికారులిద్దరూ.. సిద్ధంగా లేకపోవడమో.. లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి.. తన ఆలోచనను వెనక్కి తీసుకోవడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఒక వేళ… అధికార బదిలీ ప్రాసెస్ అయితే.. మాత్రం.. ఇంత కాలం పట్టదని అంటున్నారు.