తెలంగాణలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పవర్ చేతుల్లో ఉండటంతో నిబంధనలకు పాతరేస్తున్నారు. అధికారుల ఛాంబర్ లో పని చేసేందుకు ప్రభుత్వం అటెండర్లను నియమిస్తే వారిని అధికారులు తమ సొంతింటి పనుల కోసం వాడుకోవడం గమనార్హం.
సొంత ఇంటి అవసరాల కోసం అధికారులు ఒక్కరిద్దరితో కాదు… ఏకంగా పదిమందితో పనులు చేయిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నాతాధికారుల ఇళ్లలో హౌజ్ కీపింగ్ , వెహికిల్ క్లీనింగ్ , గార్డెనింగ్ పనులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో చేయిస్తున్నట్లు తెలుస్తోంది.
సచివాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఏకంగా ముప్పై మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారని…మరో సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో పది మంది పని చేస్తున్నట్లు టాక్. ఇలా చాలామంది ఉన్నతాధికారుల నివాసాలలో కింది స్థాయి ఉద్యోగులను సొంతింటి పనుల కోసం వాడుకుంటున్నారని సచివాలయ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇటీవల సచివాలయంలో ఓ డేటా ఎంట్రీ ఎంప్లాయ్ మృతి వెనక ఉన్నతాధికారి వేధింపులే కారణమని ఆరోపణలతో ఈ విషయం బయటకు వచ్చింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని కానీ, విషయం బయటకు చెప్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందనే భయంతో వారు మౌనం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సొంతింటి అవసరాల కోసం వాడుకుంటున్నారనే విషయం నిఘా వర్గాలకు గుర్తించినట్లు సమాచారం. దాంతో సచివాలయంలో కీలక హోదాలోనున్న ఉన్నతాధికారుల వద్ద ఎంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు…? ఎంతమందిని తమ ఇంటి అవసరాలకు వాడుకుంటున్నారనే విషయాన్ని తేల్చి సీఎంవో అధికారులకు రిపోర్ట్ చేరవేయనున్నట్లు తెలుస్తోంది.