“దుర్మార్గుడైన రాజు కింద పని చేయడం కంటే అడవికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడం మంచిదని” ఓ కవి చెప్పారని తనపై రెండో సారి సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ కవి ఎవరు అని కొంత మంది వెదికారు కానీ.. ఆ కవి జాడ తెలియలేదు. కానీ ఆ కవి ఏబీ వెంకేటేశ్వరరావేనని రెండు రోజుల తర్వాత తెలిసింది. అన్నట్లుగానే ఆయన పొలానికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నారు.
మూడేళ్ల పాటు ఏ పోస్టింగ్ లేకుండా రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉంచి .. సుప్రీంకోర్టు ఆదేశాలతో చివరికి పోస్టింగ్ దక్కించుకున్న పదిహేను రోజుల్లోనే మళ్లీ సస్పెన్షన్ వేటు వేయడంతో ఏబీవీ బాగా ఫీలయ్యారు. ఐపీఎస్‌గా ముఫ్పై ఏళ్ల అనుభవం ఉన్న ఏబీకి డీజీ హోదా ఉంది. అయినప్పటికీ చెప్పినట్లుగా వ్యవసాయంలోకి దిగిపోయారు. దుక్కి దున్నేశారు. ఇ పొలంలో రైతుగా మారిపోయిన ఏబీ వెంకటేశ్వరరావు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఏబీ వెంకటేశ్వరరావు గత ప్రభుత్వ హయాంలో అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. ఏబీ వెంకటేశ్వరరావు సర్వీసు మరో రెండేళ్ల పాటు ఉంటుంది. అంటే ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మాత్రమే సర్వీసు ఉంటుంది. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఆయన రిటైర్ అవుతారు. అయితే.. తనపై తప్పుడు ఆరోపణలు చేసి.. తప్పుడు కేసులు పెట్టిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని చెబుతున్నారు.