నమ్మకస్తులైన అధికారుల్ని ఎక్కడ ఉన్న ఏపీ సర్వీసులోకి తీసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అలాగే గతంలో టీడీపీ పెద్దలతో అనుబంధం ఉన్న వారు కూడా తాము ఏపీలో పని చేస్తామని వస్తున్నారు. ఇలాంటి వారిలో కొంత మందిని చంద్రబాబు ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ ఆపీసర్ సుబ్బరాయుడుకు ఏపీకి మూడేళ్ల పాటు డిప్యూటేషన్ పై వెళ్లేందుకు అనుమతి లభించింది.
ఏపీకి చెందిన సుబ్బరాయుడుకు విభజన సమయంలో తెలంగాణ క్యాడర్ ఖరారయింది. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సహా పలు కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధన మేరకు ఎపికి ఆయన పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐపిఎస్ అధికారి సుబ్బరాయుడు ను మూడేళ్లపాటు ఇంటర్ క్యాడర్ డిప్యూటేషన్ లో ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ వెంటనే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సుబ్బరాయుడుకు చంద్రబాబు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఐపీఎస్ మహేష్ చంద్ర లడ్హాతో పాటు రాజమౌళి, కార్తికేయమిశ్రా వంటి ఐఏఎస్ అధికారుల్ని ఏపీకి రప్పించారు. చురుగ్గా పని చేసే మరికొంత మంది అధికారుల్ని కూడా చంద్రబాబు డిప్యూటేషన్ పై ఏపీకి రప్పించే అవకాశాలు ఉన్నాయి.