తెలుగు మీడియాలో తొలి తరం దిగ్గజ జర్నలిస్టుల్లో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా..క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పత్రికా రంగంలో యాభై ఏళ్లపాటు సేవలు అందించారు. 1934లో గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించిన ఆయన.. 1957లో ఆంధ్రజనత ద్వారా జర్నలిజంలోకి అడుగు పెట్టారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. అన్ని ప్రముఖ పత్రికలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్ర ప్రభ, ఉదయం, వార్తా పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దినపత్రిక సంపాదకులుగా చాలా కాలం పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. పలు పుస్తకాలు కూడా రాశారు.
ప్రస్తుతం జర్నలిజం వృత్తిలో ఉన్న వారిలో అత్యధికులు ఆయన శిష్యులే. ఆయన శిక్షణలో రాటుదేలిన ఎందరో.. ప్రముఖ జర్నలిస్టులుగా విధి నిర్వహణలో ఉన్నారు. ఆయనతో మాట్లాడటమే విజ్ఞానమని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కీలకంగా వ్యవహరించినా… ఫలానా పార్టీ వ్యక్తి అని ముద్రపడని జర్నలిస్టుగా.. పొత్తూరి వెంకటేశ్వరరావును చెప్పుకోవచ్చు. ఆయన నిఖార్సైన జర్నలిజాన్ని అన్ని పార్టీల నేతలు స్వాగతిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన పుట్టిన రోజున ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు చెప్పి వస్తూంటారు. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ గౌరవిస్తారు.
పత్రికా రంగంలో విలువలు ఎలా ఉండాలో… ఫోర్త్ ఎస్టేట్‌గా.. ఎలా తన ఉన్నతిని మీడియా నిలబెట్టుకోవాలో… పొత్తూరి వెంకటేశ్వరారవు తన పనితీరు ద్వారానే చూపించారు. ఆయన అంటే అభిమానించని జర్నలిస్టు కూడా లేదు. కొత్త తరం ఆయనతో పని చేసి ఉండకపోవచ్చు కానీ.. ఇప్పుడు మీడియా రంగంలో సీనియర్లుగా ఉన్న కీలక జర్నలిస్టులందరూ.. పొత్తూరిని అభిమానించేవారు. ఆయన దగ్గర విలువ పాఠాలు తెలుసుకున్నవారే. తెలుగు జర్నలిజానికి.. పొత్తూరి మరణం తీరని లోటే..!