పార్టీలకు అతీతంగా రాయలసీమకు చెందిన రాజకీయ నేతలు ఒక్కతాటిపైకి వచ్చి .. తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. కృష్ణాపై ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి పోవడంతో ప్రధానంగా రాయలసీమ నష్టపోతుందన్న అభిప్రాయం జల వనరుల నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగా సీనియర్ నేతలు గళమెత్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీ సీఎం.. తెలంగాణ సీఎంతో గిల్లికజ్జాలు పెట్టుకుని రాయలసీమ గొంతు కోస్తున్నారని వారు అంటున్నారు. గ్రేటర్ రాయలసీమ కోసం మైసూరా రెడ్డి నేతృత్వంలో సీనియర్లంతా కలిసి ఓ వేదికగా ఏర్పడ్డారు. ఇప్పుడు మైసూరారెడ్డి మీడియా ముందుకు వచ్చి జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు.
అసలు ఏపీలో సీమ అంతర్భాగమా కాదో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ను జగన్‌ను స్వాగతించడాన్ని ఆయన తప్పు పట్టారు. రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై ఐదు రాష్ట్రల ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు సీఎంలు మాట్లాడుకోలేరా? అని ప్రశ్నించారు. ఇష్టారీతిన తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండుంటే.. అన్యాయం జరిగేది కాదని తన వాదన వినిపించారు.
నిజానికి రాయలసీమ ప్రజల్లో కూడా ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తమవుతోంది. నీటిపై ప్రభుత్వం హక్కులను వదులుకోవడం అంటే.. సీమను ఎండ బెట్టినట్లేనని చెబుతున్నారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకుని సీమ ఎత్తిపోతల నిర్మించాల్సింది పోయి.. వివాదాన్ని పెంచి పెద్దది చేసుకుని మొదటికే మోసం తెచ్చారన్న అభిప్రాయం.. సీమ ప్రజల్లో .. సీమ నేతల్లో ఉంది.కానీ.. వైసీపీ నేతలు నోరు ఎత్తే పరిస్థితి లేదు. ఇప్పుడు..మెల్లగా సీనియర్ నేతలు సమస్యను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.