తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు టీఎస్ గా మారింది తప్ప ఏమీ తేడా లేదంటూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అవి పార్టీకి, ప్రభుత్వానికి నష్టం చేసేలా ఉన్నాయని .. చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అదేనని గుర్తు చేస్తున్నారు. కొన్ని రోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి కనిపిస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా…ఇతర పార్టీల నుంచి వచ్చిన వారినే అధిష్టానం గుర్తిస్తోంది తప్ప… తమని పట్టించుకోవటం లేదనే భావన నేతల్లో ఉంది. ఈటల, రసమయిలతో అగుతుందా… ఉద్యమకారులం అంటూ మరికొంతమంది ముందుకొస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలో నేతల అసమ్మతి రాగం ఆలపిస్తుండటం టీఆర్ఎస్ అధిష్ఠానానికి మింగుడు పడటం లేదు. హైకమాండ్ కు సన్నిహితులుగా పేరున్న నేతలే ఇప్పుడు ధిక్కార స్వరం వినిపినిపించటం గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. కేసీఆర్ గీసిన గీతను దాటని టీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఉద్యమకారులం మేమే అంటూ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్త పర్చటం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి పార్టీలో సీనియర్ నేతలంతా మౌనం వహిస్తున్నారు. మాజి హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి, హరీష్ రావు, పద్మారావు లాంటి సీనియర్ నేతలు ప్రస్తుతం వారి నియోజకవర్గాలకు పరిమితం అయ్యారు.
మొదటి నుంచి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు గుసగుసలాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న ఇప్పుడు తమకు ప్రియార్టీ ఇవ్వటం లేదనే భావనలో వారున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలు కూడా ఈటెల తరహాలో ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ టీఆర్ఎస్లో నడుస్తోంది.