వైసీపీ అగ్రనేతల్లో చాలా మంది పార్టీ మారిపోతున్నారని రెండు రోజులుగా సోషల్ మీడియాకు లీకులు వస్తున్నాయి. ఆ లీకులు వైసీపీ క్యాంపు నుంచే వస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్ తో పాటు ఆరుగురు మాజీ మంత్రులంటూ పుకార్లు వస్తున్నాయి. వీటికి కాస్త బలం వచ్చేలా ఆ మంత్రులెవరూ వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. విచిత్రంగా జోగి రమేష్ తాను కోరుకున్నట్లుగా మళ్లీ మైలవరం ఇంచార్జ్ పదవి ఇచ్చినప్పటికీ ఆయన ఆ నియోజకవర్గం జోలికి వెళ్లడం లేదు.
రెడ్డి వర్గం నేతలు ఈగో కోసం తన రాజకీయ జీవితాన్ని జగన్ రెడ్డి బలిపెట్టాడని అనిల్ కుమార్ యాదవ్ కు బాగా తెలుసు.కానీ ఆయనకు మరో దారి లేక జగన్ రెడ్డి అంటే ఒక ఇది.. ఒక అది అని కొన్నాళ్లు చెప్పారు.ఇప్పుడు ఆయనకూ తత్వం బోధపడిందని అంటున్నారు. పవన్ కల్యాణ్ కు వీరాభిమానిగా పేరున్న ఆయన … జగన్ రెడ్డి దగ్గర తన విధేయత నిరూపించుకోవడానికి చేయని వ్యాఖ్యలు లేవు. నోరు అదుపులో ఉండని అనిల్ కుమార్ కూడా ఇప్పుడు తన భవిష్యత్ కు పవన్ భరోసా ఇస్తారని ఆశపడుతున్నారని చెబుతున్నారు.
మొత్తంగా ఆరుగురు మంత్రులు జనసేన, టీడీపీల్లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారని చెబుతున్నారు. వారితో పాటు పదుల సంఖ్యలో ఇతర స్థాయి నేతలు కూడా అదే దారిలో ఉన్నారు. వీరిని ఆపేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. జగన్ రెడ్డికి అంత తీరిక లేదు. ఆయనకు అంత సామర్థ్యం ఉంటే సొంత ఇంట్లో చిచ్చు పెట్టుకునే పరిస్థితి ఉండదని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.